బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాల్‎లో చొరబాటుదారులను ఏరేస్తం: ప్రధాని మోడీ

బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాల్‎లో చొరబాటుదారులను ఏరేస్తం: ప్రధాని మోడీ

మాల్దా: పశ్చిమ బెంగాల్‌‌‌‌కు అక్రమ చొరబాట్లే అతిపెద్ద సవాల్‌‌‌‌ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అధికార పార్టీ (టీఎంసీ) ఇస్తున్న రక్షణ, సిండికేట్ రాజ్ వల్లే ఈ అక్రమ వలసలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. శనివారం పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలి వందే భారత్‌‌‌‌ స్లీపర్‌‌‌‌‌‌‌‌ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లతోపాటు బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉద్దేశించిన రూ. 3,250 కోట్ల విలువైన రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. 

అనంతరం నిర్వహించిన మెగా ర్యాలీలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న చొరబాట్లను ప్రధాన అంశంగా ప్రస్తావించారు. అక్రమ వలసల కారణంగా బెంగాల్ రూపురేఖలు మారిపోతున్నాయని, ఇది అల్లర్లకు దారితీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్ల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల జనాభా వర్గీకరణలోనూ మార్పు వచ్చిందని, వీటిని అరికట్టడానికి టీఎంసీ సర్కారు ఎలాంటి  చర్యలు చేపట్టలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మతపరమైన వేధింపుల వల్ల భారత్​కు వచ్చిన శరణార్థులు భయపడాల్సిన పనిలేదని మోదీ స్పష్టం చేశారు.

బెంగాల్‌‌‌‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు

చొరబాటుదారులకు, అధికార టీఎంసీకి మధ్య బలమైన అనుబంధం ఉందని మోదీ మండిపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ఉచిత విద్యుత్‌‌‌‌లాంటి పథకాలను మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. రాష్ట్రానికి వరద సహాయ నిధులను 40 సార్లు అందించామని, అయినా అవి అసలైన లబ్ధిదారులకు చేరలేదని పేర్కొన్నారు.  ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో మమతా బెనర్జీ  ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

 బెంగాల్‌‌‌‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. బెంగాల్ చుట్టూ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని, ఇప్పుడు బెంగాల్‌‌‌‌లో కూడా సుపరిపాలన రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిహార్‌‌‌‌లో ఎన్డీయే విజయం సాధించిందని, ఇక బెంగాల్‌‌‌‌ వంతు అని అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, కేరళలో లభించిన విజయాలను ప్రస్తావిస్తూ.. పార్టీ అభివృద్ధి నమూనా ఓటర్ల నమ్మకాన్ని, ముఖ్యంగా జెన్​జీ యువత  విశ్వాసాన్ని పొందుతోందని చెప్పారు.

వందే భారత్‌‌‌‌ స్లీపర్‌‌‌‌‌‌‌‌ రైలు ప్రత్యేకతలివే..

భారత్‌‌‌‌లో తొలి వందేభారత్‌‌‌‌ స్లీపర్‌‌‌‌ రైలు పట్టాలెక్కింది. ఈ రైలు హౌరా నుంచి అస్సాంలోని కామాఖ్య జంక్షన్‌‌‌‌ వరకు నడుస్తుంది. గరిష్ఠ వేగం 180 కి.మీ. ప్రస్తుతం గంటకు 120-130 కి.మీ. స్పీడ్‎తో నడుస్తోంది. ఈ రైల్లో 16 కోచ్‌‌‌‌లు ఉన్నాయి. విమానం తరహా అనుభూతినిచ్చేలా ఎర్గోనామిక్ బెర్త్‌‌‌‌లు, ఏరోడైనమిక్ డిజైన్, అత్యుత్తమ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. నిరంతర నిఘా కోసం సీసీ టీవీ  కెమెరాలు ఉన్నాయి. రైలు స్టేషన్ లో ఆగినప్పుడు మాత్రమే తెరుచుకునే ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లను అమర్చారు. కనీస చార్జి రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. ఏసీ 1,2,3 టైర్​ ధరలు రూ. 2,300 నుంచి రూ. 3,600 మధ్య ఉంటాయి.