అమెరికాకు ప్రపంచంలో అతి ముఖ్యమైన పార్టీ బీజేపీయే!

అమెరికాకు ప్రపంచంలో అతి ముఖ్యమైన పార్టీ బీజేపీయే!
  • వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం 
  • మళ్లీ బీజేపీనే గెలుస్తుందని వెల్లడి 

న్యూఢిల్లీ: అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఫారిన్ పొలిటికల్ పార్టీ బీజేపీ అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇండో పసిఫిక్ రీజియన్​లో జపాన్​తో కలిసి ఇండియా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని తెలిపింది. రానున్న కాలంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు అమెరికాకు ఇండియా సాయం ఎంతో అవసరమని చెప్పింది. 2014, 2019లో వరుస విజయాలు సాధించిన బీజేపీ.. 2024లోనూ విజయం సాధించే దిశగా ముందుకువెళ్తోందని వెల్లడించింది. బీజేపీ, ఇండియా అభివృద్ధి, అమెరికాతో సంబంధాలపై కాలమిస్ట్ వాల్టర్ రస్సెల్ మీడ్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో కథనం రాశారు. ‘హిందూ మార్గం’ కోసం ఎన్నో ఏండ్లుగా ఎంతో మంది చేసిన ప్రయత్నాల ఆధారంగా బీజేపీ విజయం సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇతర వర్గాలకు దగ్గరవుతున్న బీజేపీ.. 

బీజేపీపై ఉన్న హిందూ ముద్ర విషయాన్నీ వాల్టర్ తన కథనంలో ప్రస్తావించారు. బీజేపీపై ఉన్న ఆ ముద్ర తొలగిపోతోందని ఆయన చెప్పారు. ఇతర వర్గాలకూ పార్టీ దగ్గరవుతోందని తెలిపారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు పెట్టుకోవడానికి వచ్చిన ఆహ్వానాలను అమెరికన్లు తిరస్కరించలేరు. చైనాతో టెన్షన్స్ నేపథ్యంలో అమెరికాకు ఎకనామిక్, పొలిటికల్ పార్ట్ నర్​గా ఇండియా అవసరం ఉంది. హిందూ నేషనలిస్ట్ మూవ్​మెంట్​ను అర్థం చేసుకోవడం ఇండియాలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఎంతముఖ్యమో.. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు డిప్లమాట్స్, ఫారిన్ పాలసీ మేకర్లకు అంతే ముఖ్యం’ అని పేర్కొన్నారు.