ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

మిర్యాలగూడ, వెలుగు : హామీల అమలులో సీఎం కేసీఆర్‌‌ విఫలం అయ్యారని బీజేపీ మిర్యాలగూడ నియోజకవర్గ పాలక్‌‌ కవిత విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడులో బుధవారం నిర్వహించిన శక్తి కేంద్ర ఇన్‌‌చార్జుల మీటింగ్‌‌లో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా పార్టీ పేరు మార్చి ద్రోహం చేశారన్నారు. రాష్ర్టంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. లచ్చిరెడ్డి, పార్లమెంట్‌‌ కన్వీనర్‌‌ ప్రసాద్, లీడర్లు సాధినేని శ్రీనివాసరావు, పురుషోత్తంరెడ్డి  పాల్గొన్నారు.

శ్రీరాముడిగా, వెంకటేశ్వరుడిగా నారసింహుడు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు ఉదయం శ్రీరాముడిగా, సాయంత్రం వేంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ‌మొదట స్వామివారికి నిత్యారాధన, పారాయణీకుల బృందం చేత దివ్య ప్రబంద పారాయణాలు నిర్వహించారు. గురువారం స్వామివారు వెన్నకృష్ణుడు, కాళీయమర్దనుడిగా దర్శనమివ్వనున్నారు.
- యాదగిరిగుట్ట, వెలుగు 

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ నియోజకవర్గంలో పెండింగ్‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, రోడ్లు, ఇతర నిర్మాణ పనులను పూర్తి చేసామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌‌రావు చెప్పారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల పరిధిలోని చిరుమర్తి, పోరెడ్డిగూడెం, పాములపహాడ్‌‌, బీరెల్లిగూడెం గ్రామాల మధ్య నిర్మించనున్న బీటీ రోడ్డు, ఇస్కబావిగూడెం భవన నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేపడుతూ గ్రామాల రూపురేఖలను మారుస్తోందన్నారు. పనులను ఇన్‌‌టైంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్‌‌ సభ్యులు మోసిన్‌‌ అలీ, మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, పీఏసీఎస్‌‌ చైర్మన్‌‌ జెర్రిపోతుల రాములుగౌడ్‌‌,  సర్పంచ్‌‌లు గోవిందరెడ్డి, పోరెడ్డి కోటిరెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

తుంగతుర్తి, వెలుగు : బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పాలక్‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బుధవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌ నిరంకుశ, కుటుంబ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణాలలో జరిగిన అవినీతి, అక్రమాలు, బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు చేస్తున్న ఇసుక, భూ దందాను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ నెల 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్‌‌కు అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌‌చార్జి కడియం రామచంద్రయ్య, నాయకులు బంగారి, సుభాశ్‌‌రెడ్డి, సోమిరెడ్డి పాల్గొన్నారు.
 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం

నల్గొండ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని మునుగోడు నియోజకవర్గ పాలక్‌ చాడ సురేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మునుగోడులో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, ఎరువులపై సబ్సిడీని ఎత్తివేసి రైతులను మోసం చేసిందన్నారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్‌ దూడల భిక్షంగౌడ్, పార్లమెంట్‌ జాయింట్ కన్వీనర్ నారాయణయాదవ్, మునుగోడు ఇన్‌చార్జి మారిపల్లి అంజయ్య పాల్గొన్నారు.


వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి

సూర్యాపేట, వెలుగు : స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌‌ పాటిల్ హేమంత్‌‌ కేశవ్‌‌ సూచించారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌‌ కాలజీలో బుధవారం జానపద నృత్యం, పాటలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ యువత విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. జానపద నృత్యం పోటీలో టీటీడబ్ల్యూఆర్డీసీ సూర్యాపేట, జానపద పాటల పోటీలో కేఆర్‌‌ఆర్‌‌జీజేసీ కోదాడ, ఉపన్యాస పోటీలో కొమ్ము ప్రశాంత్‌‌ ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిచారు. జిల్లా స్థాయిలో గెలిచిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలకు వీరునాయుడు, అనిల్‌‌కుమార్‌‌, సత్యం, సాయిలు, బి. శ్రీనివాస్‌‌ జడ్జీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ పెరుమాండ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ కమిటీ చైర్మన్‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌గౌడ్‌‌, యువజన క్రీడల అధికారి బి. వెంకట్‌‌రెడ్డి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్‌‌ యాదయ్య, డీఐఈవో ప్రభాకర్‌‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు భద్రత అందరి బాధ్యత

రోడ్డు భద్రత అందరి బాధ్యత అని సూర్యాపేట కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్‌‌ చెప్పారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు, నివారణ చర్యలపై ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌తో కలిసి బుధవారం కలెక్టరేట్‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాలతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, స్పీడ్‌‌ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. టేకుమట్ల, పిల్లలమర్రి, జనగాం క్రాస్‌‌ రోడ్డు వద్ద లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. సూర్యాపేటలో ట్రాఫిక్‌‌ సిగ్నల్స్‌‌, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రపోజల్స్‌‌ రెడీ చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ నాగభూషణం, డీఎంహెచ్‌‌వో కోట చలం, తేజరెడ్డి, ప్రవీణ్ రెడ్డి  పాల్గొన్నారు.

కళాకారుల ప్రతిభ అమోఘం

యాదాద్రి, వెలుగు : కళాకారుల ప్రతిభ అమోఘమని యాదాద్రి కలెక్టర్‌‌ కలెక్టర్‌‌ పమేలా సత్పతి కొనియాడారు. యువజన ఉత్సవాల్లో భాగంగా బుధవారం భువనగిరిలో పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. కరోనా కారణంగా మూడేండ్లు ఉత్సవాలను నిర్వహించుకోలేకపోయామన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన కళాకారులను కలెక్టర్‌‌ అభినందించారు.  అంతకుముందు విద్యాశాఖపై నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ స్ఫూర్తి పెంచేలా బోధించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆఫీసర్లు ధనుంజనేయులు, కె.నారాయణరెడ్డి, మున్సిపల్‌‌ చైర్మన్‌‌ ఎనబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నిర్మల, వైస్‌‌ చైర్మన్‌‌ చింతల కిష్టయ్య పాల్గొన్నారు.

పేదలకు వైద్యం అందించేందుకు కృషి

హాలియా, వెలుగు : ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్‌‌ ఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌లోని కమలా నెహ్రూ హాస్పిటల్‌‌లో డయాలిసిస్ సెంటర్‌‌ను ఎమ్మెల్యే నోముల భగత్‌‌కుమార్‌‌, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి‌‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో డయాలిసిస్‌‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సాగర్‌‌లోని డయాలిసిస్‌‌ సెంటర్‌‌లో రోజుకు 20 మంది పేషెంట్లకు డయాలిసిస్ చేయవచ్చని, ఇందుకోసం అవసరమైన సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 డయాలిసిస్ సెంటర్లను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రైకార్‌‌ చైర్మన్‌‌ ఇస్లావత్‌‌ రాంచందర్‌‌ నాయక్‌‌, అడిషనల్‌‌ కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, జడ్పీ వైస్‌‌ చైర్మన్‌‌ ఇరిగి పెద్దులు, డాక్టర్‌‌ మాతృ, డీఎంహెచ్‌‌వో కొండల్‌‌రావు, హాస్పిటల్‌‌ సూపరిండెంట్‌‌ భానుప్రకాశ్‌‌, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్‌‌ కర్ణ అనూషరెడ్డి పాల్గొన్నారు.

కేటీఆర్‌‌ టూర్‌‌ సక్సెస్‌‌ చేయండి

హుజూర్‌‌నగర్‌‌/మునుగోడు, వెలుగు : ఈ నెల 6న సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్‌‌, నల్గొండ జిల్లా చండూరులో జరగనున్న మంత్రి కేటీఆర్‌‌ టూర్‌‌ను సక్సెస్‌‌ చేయాలని ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి కోరారు. ఆయా మండలాల్లో అభివృద్ధి పనులను చేపట్టనున్న స్థలాలను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం హుజూర్‌‌నగర్‌‌లో కలెక్టర్‌‌ పాటిల్‌‌ హేమంత్‌‌ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌తో కలిసి ఎమ్మెల్యే సైదిరెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్‌‌నగర్‌‌ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. హుజూర్‌‌నగర్‌‌లో ఆర్డీవో వెంకారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌‌రెడ్డి, సీఐ రామలింగారెడ్డి, మున్సిపల్‌‌ కమిషనర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి, సత్యనారాయణ, నల్గొండ  అడిషనల్‌‌ కలెక్టర్‌‌ భాస్కర్‌‌రావు, మున్సిపల్‌‌ చైర్మన్‌‌ తోకల చంద్రకళ, వెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, కొంరెడ్డి యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకట్‌‌ మణికరణ్‌‌, సీఐ సురేశ్‌‌కుమార్‌‌ 
పాల్గొన్నారు.

‘పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి’

తుంగతుర్తి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌కుమార్‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండాలో నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్‌‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం తుంగతుర్తిలో ఎస్సీ కమ్యూనిటీహాల్‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. పంచాయతీ ప్రత్యేక నిధులు విడుదల చేయడం వల్ల అభివృ-ద్ధికి పెద్దపీట వేశామన్నారు. అనంతరం అన్నారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌‌ఎస్‌‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే తుంగతుర్తి, తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించిన బోధనాభ్యసన సామగ్రి తొలిమెట్టు మేళాను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌‌పర్సన్‌‌ గుజ్జ దీపిక యుగంధర్‌‌రావు, మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ పోతరాజు రజనీ రాజశేఖర్‌‌, మార్కెట్‌‌ చైర్‌‌పర్సన్‌‌ కొమ్మినేని స్రవంతి సతీశ్‌‌, ఎంపీపీలు స్నేహలత, భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జడ్పీటీసీలు అంజలీ, కందాల దామోదర్‌‌రెడ్డి పాల్గొన్నారు.

మీటింగ్‌‌కు హాజరుకండి

నల్గొండ, వెలుగు : ఈ నెల 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నిర్వహించే వర్చువల్‌‌ సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌‌గౌడ్‌‌ పిలుపునిచ్చారు. నల్గొండలోని పార్టీ ఆఫీస్‌‌లో బుధవారం నిర్వహించిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఏచూరి గార్డెన్స్‌‌లో ర్పాటు చేసే ఎల్‌‌ఈడీ స్క్రీన్ల ద్వారా నడ్డా ప్రసంగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్‌‌ కన్వీనర్‌‌ బండారు ప్రసాద్, సీనియర్‌‌ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌‌రెడ్డి, పోతెపాక సాంబయ్య పాల్గొన్నారు.