సింగరేణిని ప్రైవేట్​పరం చేసేది కేసీఆరే..మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి

సింగరేణిని  ప్రైవేట్​పరం చేసేది కేసీఆరే..మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి
  • ధనిక రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారు
  • బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఇన్​కమ్ ట్యాక్స్ ప్రభుత్వమే చెల్లిస్తది
  • మందమర్రిలో గడపగడపకు బీజేపీ, జగిత్యాలలో మహా జన్ సంపర్క్​ అభియాన్

మందమర్రి(కోల్​బెల్ట్)​/జగిత్యాల/ వెల్గటూర్, వెలుగు: సింగరేణిని కేసీఆర్​ ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సింగరేణిని యాజమాన్యం నడిపించడం లేదని కేసీఆర్, టీబీజీకేఎస్ లీడర్లు చెప్పినట్లు ఆఫీసర్లు నడిపిస్తున్నారని అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ధర్మపురి నియోజకవర్గ బీజేపీ మహా జన్ సంపర్క్ అభియాన్, మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సి పాలిటీలో గడపగడపకు బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ రూ.6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచాడని విమర్శించారు.

 కాళే శ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని.. బ్యాక్ వాటర్ వల్ల చెన్నూరు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల్లో వేలాది మంది రైతులు నష్టపోయినా ఎలాంటి పరిహారం చెల్లించలేదన్నారు. ‘‘మా నాన్న కాకా వెంకటస్వామి చొరవతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.33 వేల కోట్లు కేటాయించగా.. అందులో రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టి 50శాతం పనులు కూడా పూర్తి చేశారు” అని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ తన తుగ్లక్ నిర్ణయాలతో ప్రజల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేశాడని మండిపడ్డారు. ధర్మపురిలో వారం రోజులుగా తాగునీళ్లు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

సింగరేణిపై ఉల్టా ప్రచారం

సింగరేణిలో 51శాతం వాటా కలిగిన రాష్ట్ర సర్కారుకే సంస్థను ప్రైవేటు పరం చేసే అవకాశం ఉంటుందని.. కానీ 49శాతం వాటా కలిగిన కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కేసీఆర్ ఉల్టా ప్రచారం చేస్తున్నాడని వివేక్​అన్నారు. సింగరేణి బోర్డులో కూడా కేంద్రం నుంచి ఇద్దరు డైరెక్టర్లు ఉంటే రాష్ట్రం నుంచి ఐదుగురు ఉన్నారని, ఎవరు ప్రైవేటైజేషన్ చేసే చాన్స్ ఉందో కార్మికులు తెలుసుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఇన్​కమ్ ట్యాక్స్​ను ప్రభుత్వమే భరిస్తుందని, దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచుతామన్నారు.

వన్ నేషన్​ - వన్​రేషన్

మోడీ సర్కార్ మూడేండ్లుగా దేశంలోని 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నదని వివేక్ తెలిపారు. వన్ నేషన్-–వన్ రేషన్ మోడీ ప్రభుత్వ విధానమని తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6 వేల చొప్పున అందిస్తున్నదని గుర్తు చేశారు.