- ఫాతిమా విద్యాసంస్థల అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చరు?
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుని వేల కోట్లు కొల్లగొట్టిందని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ ప్రమాదంలో ఉందని హెచ్చరించినా ప్రభుత్వం రిపేర్లు ప్రారంభించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భారీ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి హఠాత్తుగా మమకారం ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. కేవలం కొందరు అధికారులపై చర్యలు తీసుకుని.. అసలు దొంగలను ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రశ్నించారు.
హైడ్రా అంటే.. ఇళ్లు కూల్చడమేనా?
ఫాతిమా విద్యాసంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని విద్యాశాఖే కోర్టుకు చెప్పిందని, హైకోర్టు కూడా తప్పుబట్టిందని, హైడ్రా కూడా అది ఆక్రమణే అని అంగీకరించిందని కానీ ఎంఐఎం భవనాలను ఎందుకు కూల్చడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎంతో ఉన్న రహస్య మిత్రత్వంతోనే ఈ వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
హైడ్రాకు చట్టం ఒకేలా ఉండాలని, పేదలకు ఓ న్యాయం, ఎంఐఎంకు ఓ న్యాయం ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎంఐఎం అక్రమ కట్టడాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాపోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీశ్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.
