
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ హైదరాబాద్లో బీజేవైఎం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. బీజేవైఎం నేతలు రోడ్డుపైకి రాకుండా పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు.
అయినా నేతలు బారీకేడ్లను తోసుకుంటూ ముందుకు రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఆందోళనలతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు లాఠీచార్జి చేయడం సిగ్గుచేటన్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు నియంతృత్వానికి పరాకాష్ట అని మహేందర్ విమర్శించారు.