మతతత్వ పార్టీల మేలుకే సర్..బీఎల్ఏలు కీలకంగా పని చేయాల్సిందే

మతతత్వ పార్టీల మేలుకే సర్..బీఎల్ఏలు కీలకంగా పని చేయాల్సిందే
  •     టీపీసీసీ చీఫ్  మహేష్  కుమార్  గౌడ్

సంగారెడ్డి, వెలుగు: మతతత్వ పార్టీలకు ప్రయోజనం కలిగించేలా సర్  ప్రక్రియ కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్  గౌడ్  విమర్శించారు. ఓట్ల సవరణ వ్యవహారంలో బీఎల్ఏలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. మంగళవారం సంగారెడ్డిలో సర్ పై బూత్  లెవెల్  ఏజెంట్ల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నారు. దేశంలో సర్  ప్రక్రియ మతపరంగా కొనసాగుతోందన్నారు.

 2002లో జరిగిన సవరణ పారదర్శకంగా జరిగిందని, ఇప్పుడు బీజేపీకి పడవనుకున్న ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. చీఫ్  ఎలక్షన్  కమిషన్  బీజేపీకి అనుకూలంగా మారి వెస్ట్​ బెంగాల్ లో 92 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారన్నారు. ఈ దేశంలో అతికొద్ది మంది నిజాయితీ గల నేతల్లో మీనాక్షి నటరాజన్  ఒకరని, ఆమె నామినేషన్  తిరస్కరించడం అన్యాయమన్నారు.

తెలంగాణకు పవన్ సానుభూతి అక్కర్లే

తెలంగాణ ఏర్పడినప్పుడు 10 రోజులు అన్నం తినలేదని పవన్  కల్యాణ్  సానుభూతి చూపిస్తున్నాడని, ఈ రాష్ట్రానికి ఆయన సానుభూతి అవసరం లేదని మహేశ్​ తెలిపారు. పవన్  వెనుక బీజేపీ ఉండి మాట్లాడిస్తుందన్నారు. దేశంలో మతం పేరుతో ఓట్లు వేసే రోజులు పోయాయన్నారు. కేసీఆర్  హయాంలో ప్రైవేట్​ ఆస్పత్రులు బాగుపడితే కాంగ్రెస్ హయాంలో పీహెచ్సీల నుంచి నిమ్స్  వరకు ప్రక్షాళన చేశామన్నారు. 

ఇప్పటి వరకు 80 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలను ఆదుకున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్  అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం రేవంత్​రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మహేష్  కౌంటర్  ఇచ్చారు. 12 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిగా నిధులు రావడం లేదని, విభజన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆరోపించారు. 

మీరు సబర్మతి కట్టుకోవచ్చు.. మేము మూసీ ప్రక్షాళన చేస్తామంటే నిధులు ఎందుకివ్వరన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్  శేట్కార్, నారాయణఖేడ్  ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఫుడ్  కార్పొరేషన్  చైర్మన్  ఫయీమ్, టీజీఐఐసీ చైర్ పర్సన్  నిర్మలారెడ్డి, టీపీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.