
కరాచీ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో బుధవారం ఘోరం జరిగింది. కంద్‌కోట్ తహసీల్, జాంగీ సబ్జ్వాయ్ గోత్ గ్రామంలోని ఓ ఇంట్లో రాకెట్ లాంచర్ షెల్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కంద్‌కోట్ పోలీసుల వివరాల ప్రకారం.. గ్రౌండ్ లో ఆడుకుంటుండగా పిల్లలకు రాకెట్ షెల్ దొరికింది. విచిత్రంగా ఉండడంతో పిల్లలు దానిని ఇంటికి తీసుకెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో రాకెట్ లాంచర్ షెల్ ఒక్కసారిగా పేలిందని వివరించారు. దీంతో ఐదుగురు పిల్లలతో సహా 9 మంది చనిపోయారని.. మరో ఐదుగురికి గాయాలయ్యాయన్నారు. సమీపంలోని నదీతీర ప్రాంతాల్లో దాక్కునే డెకాయిట్‌లు ఈ రాకెట్ షెల్‌ను పిల్లలు ఆడుకునే గ్రౌండ్లో పెట్టి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.