లక్నోలో ‘సర్‌‌‌‌‌‌‌‌’ పని ఒత్తిడి తట్టుకోలేక బీఎల్వో సూసైడ్

లక్నోలో  ‘సర్‌‌‌‌‌‌‌‌’ పని ఒత్తిడి తట్టుకోలేక బీఎల్వో సూసైడ్
  •     సమయంలేక సర్వే పూర్తిచేయలేకపోయానని మనస్తాపం
  •     తనను క్షమించాలంటూ కుటుంబానికి వీడియో సందేశం
  •     ఉత్తరప్రదేశ్​లోని మొరాదాబాద్‌‌‌‌లో ఘటన

లక్నో: కేంద్ర సర్కారు దేశవ్యాప్తంగా చేపట్టిన రెండో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌‌‌‌‌) ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని రాష్ట్రాల్లో బూత్‌‌‌‌ లెవల్‌‌‌‌ అధికారులు (బీఎల్​వో) ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్​ చేసుకుంటున్నారు. తాజాగా, యూపీకి చెందిన సర్వేశ్‌‌‌‌ సింగ్(46) అనే బీఎల్​వో బలవన్మరణానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఆత్మహత్యకు ముందు ఆయన  తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్​గా మారింది.  

తనకు బతకాలని ఉందని కానీ.. పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని అందులో ఏడుస్తూ చెప్పారు. టైం ఉంటే టార్గెట్​ పూర్తి చేసేవాడినని, సమయం లేకే తాను విఫలమయ్యానని చెప్పారు. సూసైడ్ చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని కుటుంబ సభ్యులను కోరారు.
 
20 రోజులనుంచి నిద్రపోవడంలేదు..

మొరాదాబాద్‌‌‌‌లోని బహేడీ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సర్వేశ్‌‌‌‌ సింగ్ అసిస్టెంట్ టీచర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 7న మొదటిసారి ఆయన బీఎల్​వో బాధ్యతలు  తీసుకున్నారు. సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో భాగంగా ఒక్కో  బూత్‌‌‌‌లో 956 మంది ఓటర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. 30 రోజుల్లో ఈ పని పూర్తిచేయాలని టార్గెట్​ పెట్టారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున.. సర్వేశ్‌‌‌‌ ఇంట్లో చనిపోయి ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. 

సూసైడ్ నోట్‌‌‌‌తోపాటు ఓ సెల్ఫీ వీడియోను అతడు రికార్డ్​ చేసి పెట్టారు. బీఎల్​వో విధుల కారణంగా పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని తెలిపారు. ‘‘దీదీ, మమ్మీ నన్ను క్షమించండి. దయచేసి నా నలుగురు పిల్లలను చూసుకోండి. నేను ఈ ఎన్నికల విధుల్లో విఫలమయ్యాను. 

15గంటలు పనిచేసినా టార్గెట్​ రీచ్​ కాలే. ఇందులో ఎవరి తప్పు లేదు. మనస్తాపంతోనే చనిపోతున్నా. ఒత్తిడి వల్ల 20 రోజులుగా సరిగ్గా నిద్రకూడా పోలేదు” అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. కాగా, సర్వేశ్‌‌‌‌ సింగ్​ మరణానికి కారణమైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్​ చేశారు.

వెస్ట్​ బెంగాల్‌‌‌‌లో బీఎల్​వోల ఆందోళన

సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ పూర్తిచేసేందుకు తమకు తక్కువ సమయం, తక్కువ పేమెంట్ ఇస్తున్నారంటూ బెంగాల్‌‌‌‌లో బీఎల్​వోలు ఆందోళనకు దిగారు. కోల్‌‌‌‌కతాలోని చీఫ్‌‌‌‌ ఎలక్టోరల్‌‌‌‌ ఆఫీసర్స్ (సీఈవో)​ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. బీఎల్​వో అధికార్ రక్ష కమిటీ నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్రిక్తత నెలకొన్నది. సీఈవో ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు బారికేడ్లను నిరసనకారులు తొలగించగా.. పోలీసులు అడ్డుకున్నారు. 

దీంతో వారి మధ్య ఘర్షణ నెలకొంది. కాగా, తమకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష బీజేపీ నేతలను నిరసనకారులు అడ్డుకున్నారు. అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్​ చేశారు. బీఎల్​వోలకు తక్కువ గౌరవ వేతనాలు ఇస్తూ.. సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను తృణమూల్ ​సర్కారు ఎందుకు వ్యతిరేకిస్తున్నదని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు.