- కాలుష్యంతో ఎరుపెక్కిన ఇండోనేసియా ఆకాశం
- కార్చిచ్చులతో పొల్యూషన్..
- కోటి మంది పిల్లలకు రిస్క్
ఇండోనేసియాలో ఇటీవల ఆకాశం ఎర్రబడ్డది. నింగి అంతా రక్తాన్ని పులుముకున్నట్లు ఎటు చూసినా ఎరుపు రంగే! మార్స్ పై ఉన్నామా? లేక ఇంకేదైనా వింత గ్రహంపై ఉన్నామా? అనుకునేంతలా దిక్కులన్నీ ఎరుపెక్కిపోయాయి. అయితే, ఈ ఎరుపు రంగుకు అసలు కారణం కార్చిచ్చులు కాగా.. వీటి వల్ల ఆ దేశంలో సుమారు కోటి మంది పిల్లలు రిస్క్‌లో పడ్డారు! ఇండోనేసియా అడవుల్లో రేగిన కార్చిచ్చుల వల్ల విపరీతంగా వెలువడిన పొగ, గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలోకి చేరడంతో ఇటీవల సుమత్రా, బోర్నియో దీవులను దట్టమైన పొగమంచు ఆవరించింది. పొగమంచులోని వాయువుల కారణంగానే మిట్ట మధ్యాహ్నం పూట ఆకాశమంతా ఇలా ఎరుపుమయం అయిపోయింది. అయితే, ఈ ఎరుపు రంగుకు ఆ దేశ రైతులు కూడా కారణమే! వాళ్లు ఏటా జూలై నుంచి అక్టోబరు వరకు గడ్డి, చిన్న చిన్న చెట్లు, పొదలతో ఉండే బీడు భూములను తగలబెట్టి, పంటలు వేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటుంటారు.
దీనివల్ల విపరీతమైన పొగ, గ్రీన్ హౌజ్ వాయువులు అట్మాస్పియర్ లోకి విడుదలవుతున్నాయి. అలాగే చాలా చోట్ల పంటభూముల నుంచి మంటలు అదుపు తప్పి సమీపంలోని అడవులకు అంటుకుని, కార్చిచ్చులు రేగుతున్నాయి. దీని వల్ల గాలి కాలుష్యం పెరిగి 18 ఏళ్లలోపు ఉన్న కోటి మంది పిల్లల ఆరోగ్యానికి రిస్క్ ఏర్పడుతోందని, వీరిలో పావు వంతు మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ హెచ్చరించింది. చిన్నపిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, వారికి ఈ కాలుష్యం వల్ల మరింత ప్రమాదమని తెలిపింది. ఏటా లక్షల మంది పిల్లలు ఈ విషపూరిత గాలిని పీలుస్తున్నారని, దీనివల్ల వారికి శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబరు 18 వరకు ఇండోనేసియా కార్చిచ్చుల వల్ల 360 కోట్ల టన్నుల గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యాయని యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్ సైంటిస్టులు వెల్లడించారు.
క్లైమేట్ చేంజ్ తో మన పవర్ ప్లాంట్లకు నీటి కరువు
బొగ్గు, నేచురల్ గ్యాస్ లేదా న్యూక్లియర్ ఫ్యూయెల్‌తో నడిచే పవర్ ప్లాంట్లలో మెషిన్లు విపరీతంగా వేడెక్కుతుంటాయి. అందుకే వాటిని చల్లార్చేందుకు పెద్ద ఎత్తున నీరు అవసరమవుతుంది. అయితే, క్లైమేట్ చేంజ్ కారణంగా భవిష్యత్తులో ఇండియాలోని పవర్ ప్లాంట్లకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడవచ్చని అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ రీసెర్చర్ల స్టడీలో వెల్లడైంది. ఇండియా, చైనాతో సహా ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో వాతారణ మార్పుల ప్రభావం వల్ల ఇండియా, తదితర దేశాల పవర్ ప్లాంట్లకు నీటి కొరత తీవ్రమవుతుందని రీసెర్చర్లు తెలిపారు. వర్షాలు లేనప్పుడు, కరువు సమయాలు, ఎండాకాలం వంటి పరిస్థితుల్లో ప్లాంట్లను నడిపేందుకు ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
