ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసింది. ఈరోజే మార్చి 31. ఇప్పటికే చాలా మంది ట్యాక్స్ సేవింగ్ ప్లాన్స్ పూర్తి చేసి ఉండవచ్చు. కానీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై పడే పన్నును తగ్గించుకునేందుకు ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి ఆలోచించారా? షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో లాభాలు వస్తున్నప్పుడు ప్రభుత్వానికి పన్ను కట్టక తప్పదు. అయితే తెలివైన ఇన్వెస్టర్లు పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి వాడే అస్త్రమే ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్. ఇది పూర్తిగా చట్టబద్ధమైనది.
ముందుగా ట్యాక్స్-గెయిన్ హార్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. ఈక్విటీ పెట్టుబడులపై ఏడాదికి రూ.లక్షా 25వేల వరకు వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై రూపాయి కూడా టాక్స్ కట్టక్కర్లేదు. ఒకవేళ మీ లాభం ఈ పరిమితి దాటితే.. అదనపు మొత్తంపై 12.5% పన్ను పడుతుంది. అందుకే ఈ లాభాన్ని బుక్ చేసి, అదే మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా కాస్ట్ ఆఫ్ అక్వజిషన్ ని పెంచుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మీరు చెల్లించాల్సిన పన్ను భారీగా తగ్గుతుందన్నమాట. అందుకే టాక్స్ హార్వెస్టింగ్ చాలా కీలకంగా భావిస్తారు పెద్దపెద్ద ఇన్వెస్టర్లు.
మీ పోర్ట్‌ఫోలియోలో కొన్ని షేర్లు నష్టాల్లో ఉన్నట్లయితే.. ట్యాక్స్-లాస్ హార్వెస్టింగ్ మీకు వరంగా మారుతుంది. నష్టాల్లో ఉన్న షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన ఆ నష్టాన్ని.. ఇతర షేర్ల ద్వారా వచ్చిన లాభాలతో సర్దుబాటు చేయవచ్చు. దీనివల్ల నికర లాభం తగ్గి, కట్టాల్సిన పన్ను భారం కూడా తగ్గుతుంది. స్వల్పకాలిక నష్టాలను లాభాలతో సర్దుబాటు చేయవచ్చు. ఒకవేళ ఈ ఏడాది నష్టాలు ఎక్కువగా ఉంటే.. వాటిని వచ్చే 8 ఏళ్ల వరకు క్యారీ ఫార్వర్డ్ అంటే బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా పన్ను చట్టాలు అందిస్తున్నాయి.
అయితే గుర్తుంచుకోండి.. ఈ ప్రక్రియ అంతా ఈరోజే(మార్చి 31న) పూర్తి కావాలి. ట్రేడింగ్ సెటిల్‌మెంట్ కావడానికి సమయం పడుతుంది కాబట్టి. చివరి నిమిషం వరకు వేచి చూడటం రిస్క్ తో కూడుకున్న పని. అలాగే కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే మంచి షేర్లను వదులుకోవద్దు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, నిపుణుల సలహాతో ఈ నిర్ణయం తీసుకోండి. ఈ చిన్న జాగ్రత్త మీ కష్టార్జితాన్ని పన్నుల రూపంలో వృథా అవ్వకుండా కాపాడుతుంది. సో లేటు చేయకుండా ఆర్థిక సంవత్సరం చివరి రోజున పన్నులకు సంబంధించిన పైన పనులు పూర్తి చేయటం మీపై భారాన్ని తగ్గిస్తుందని మర్చిపోకండి.
