ఓబీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి... జాతీయ ఓబీసీ సెమినార్‌‌ లో ఎంపీల డిమాండ్

ఓబీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి... జాతీయ ఓబీసీ సెమినార్‌‌ లో ఎంపీల డిమాండ్
  •     ప్రధాని మోదీ నాయకత్వంలోనే బీసీలకు రాజకీయ న్యాయం
  •     ఎంపీ ఆర్.కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: ఓబీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ బిల్లును ఆమోదించి అసెంబ్లీ, పార్లమెంట్‌లో జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జాతీయ ఓబీసీ సెమినార్ నిర్వహించారు. సెమినార్‌కు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది ఎంపీలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక తీర్మానాలు ఆమోదించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. త్వరలో ప్రధాని మోదీని కలిసి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుతామన్నారు. జనాభా ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. బీసీ నేత అయిన మోదీ నేతృత్వంలో బీసీలకు న్యాయం జరగకపోతే.. భవిష్యత్తులో ఇంకెవరు బీసీలకు న్యాయం చేయలేరని అభిప్రాయపడ్డారు.