
- వర్క్‌ఇండియా రిపోర్ట్
న్యూడిల్లీ: కిందటేడాది బ్లూ-కాలర్ రంగంలో గిగ్ జాబ్స్ లేదా ఫ్రీలాన్స్ అవకాశాలు 92శాతం పెరిగాయని బ్లూ, గ్రే-కాలర్ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ వర్క్‌ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ఈ–-కామర్స్, ఫుడ్ డెలివరీ, రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇవి ఫ్లెక్సిబుల్, ఆన్ -డిమాండ్ లేబర్ (డిమాండ్ బట్టి పని)పై ఆధారపడుతున్నాయని తెలిపింది. “క్విక్ కామర్స్ లాంటివి కేవలం డిమాండ్ క్రియేట్ చేయలేదు, ఈ సెక్టార్‌ను నమ్మదగిన ఆదాయ వనరుగా మార్చాయి.
చిన్న నగరాల్లోని చాలా మంది క్యాండిడేట్స్‌కు డెలివరీ జాబ్స్ ఇప్పుడు తాత్కాలిక రోల్స్ కాదు, ఇవి వాళ్లకు సరైన కెరీర్ ఛాయిస్‌లు” అని వర్క్‌ఇండియా సీఈఓ నీలేష్ దుంగర్‌వాల్ చెప్పారు. 2023, 2024లో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న 4.81 లక్షల జాబ్ పోస్టింగ్స్ డేటా ఆధారంగా వర్క్‌ఇండియా రిపోర్ట్‌ను తయారుచేశారు.
ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా లాంటి నగరాలు లాస్ట్-మైల్ లాజిస్టిక్స్ జాబ్స్‌కు కీలక హబ్‌లుగా ఎదిగాయి. డెలివరీ -సంబంధిత జాబ్ పోస్టింగ్స్‌లో ప్రతి నగరంలో 100 శాతం కంటే ఎక్కువ గ్రోత్ నమోదైంది. ఇదే సమయంలో, గిగ్ రోల్స్ కోసం వెతికేవారు పెరిగారు. అప్లికేషన్స్ 63శాతం పెరిగాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ నుంచి అత్యధిక పెరుగుదల కనిపించిందని రిపోర్ట్ చెప్పింది.