సూడాన్ రాజధానిలో శవాల గుట్టలు

సూడాన్ రాజధానిలో శవాల గుట్టలు
  • సూడాన్ రాజధానిలో శవాల గుట్టలు
  • ఖార్తోమ్​లో భయానక వాతావరణం
  • వారంలో 330 మంది మృతి.. 3,200 మందికి గాయాలు 

ఖార్తోమ్​(సూడాన్):    ఆర్మీలో అంతర్యుద్ధంతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ నెత్తురోడుతోంది. గత వారం రోజులుగా సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్​ ఫోర్సెస్​(ఆర్ఎస్ఎఫ్) మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలోని కీలక నగరాలు, సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ఈ రెండు సైనిక దళాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య గురువారం నాటికి 330కి పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 3,200 మందికిపైగా గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారని తెలిపింది. ప్రత్యేకించి రాజధాని ఖార్తోమ్​లో జీవితం దుర్భరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లూటీలు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని తెలుస్తోంది.

 వేలాది మంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వలస వెళ్లిపోతున్నారు. ఇక బాంబు దాడుల్లో ఖార్తోమ్​లోని ఆస్పత్రులూ బూడిద కుప్పల్లా మారిపోతున్నాయి. నగరంలో విద్యుత్​ సరఫరా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు చీకట్లో రోజులు వెళ్లదీయాల్సి వస్తోంది. నీరు, ఆహారం కోసం కూడా జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈనేపథ్యంలో సహాయక చర్యలకు అవకాశం ఇచ్చేందుకుగానూ బుధవారం సాయంత్రం ప్రకటించిన 24 గంటల కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిలైంది.  సూడాన్ ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ ​దళాలు ఖార్తోమ్ లో గురువారం చాలాచోట్ల కాల్పులకు దిగాయి. 

177 మంది ఈజిప్టు సైనికుల బందీ 

సైనిక విన్యాసాల కోసం సూడాన్​కు వచ్చి మెరోవీ ఎయిర్​ పోర్టులో ఉంటున్న 204 మంది ఈజిప్టు సైనికులను  ఆర్ఎస్ఎఫ్​ బలగాలు శనివారం అదుపులోకి తీసుకున్నాయి. ఈజిప్టు, యూఏఈ విదేశాంగ శాఖ చర్చలు జరపడంతో ఆర్ఎస్ఎఫ్ వారిని ఈజిప్టుకు అప్పగిస్తామని ప్రకటించింది. బుధవారం 177 మంది ఈజిప్టు సైనికులను మూడు యుద్ధ విమానాల్లో పంపించారు. మిగతా 27 మంది ఈజిప్టు ఎంబసీలో ఉన్నారు.  

యుద్ధ జోన్​లో ఇండియన్ ఎంబసీ 

సూడాన్ లో ఉన్న భారత పౌరులెవరూ రాజధాని ఖార్తోమ్​లోని ఇండియన్ ఎంబసీకి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ‘‘ఇండియన్ ఎంబసీ తెరిచే ఉంది. కానీ ఆ భవనంలో ప్ర సిబ్బంది ఎవరూ ఉండటం లేదు. ఆర్ఎస్ఎఫ్​, సూడాన్​ ఆర్మీ పట్టుకోసం ప్రయత్నిస్తున్న   ఖార్తోమ్ ఎయిర్ పోర్టు పక్కనే మన ఎంబసీ ఉంది. అందువల్ల అక్కడికి ఇప్పుడు వెళ్లడం ప్రమాదకరం” అని భారత విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.