బాడీగార్డే ప్రాణాలు తీశాడు

బాడీగార్డే ప్రాణాలు తీశాడు
  • గొంతు కోసి రియల్టర్ మర్డర్  
  • భార్య ముందే దారుణ హత్య
  • పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
  • పారిపోయిన ఇద్దరు దుండగులు
  • రంగారెడ్డి జిల్లా కమ్మదనంలోని సొంత ఫామ్ హౌస్ లో ఘటన

శంషాబాద్, వెలుగు: బాడీగార్డ్ చేతిలో రియల్టర్ దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపిన ప్రకారం.. బుధవారం సాయంత్రం షాద్ నగర్ పీఎస్ కు డయల్100 నుంచి కాల్ వచ్చింది. కమ్మదనంలోని కేకే ఫామ్ హౌస్ యజమాని కమ్మరి కృష్ణను హత్య చేసినట్టు సమాచారం అందించారు.

వెంటనే షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ టీమ్ తో అక్కడికి వెళ్లారు. రియల్టర్ కృష్ణను తన బాడీగార్డ్ బాబా కత్తితో పొడిచి చంపినట్టు ప్రత్యక్ష సాక్షులు విచారణలో చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏసీపీ తెలిపారు. కాగా..“ సాయంత్రం 5 గంటలకు నా భర్త కృష్ణతో ఫామ్ హౌస్ లో ఉండగా.. బాడీగార్డ్ బాబాను టీ పెట్టమని చెప్పాం. టీ తెచ్చి ఇవ్వగా తాగారు.

అనంతరం బాబా గట్టిగా అరుచుకుంటూ కేకే రెండు చేతులు పట్టుకున్నాడు. హోండా సిటీ కారులో వచ్చి అక్కడే ఆగిన మరో ఇద్దరు దుండగులు నా భర్త గొంతును కత్తితో కోసి పారిపోయారు” అని మృతుడి రెండో భార్య విజయలక్ష్మి మీడియాకు వెల్లడించారు.  తన భర్తను శంషాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడని చెప్పారు. అనంతరం కృష్ణ బాడీగార్డ్ బాబా శంషాబాద్ రూరల్ పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని షాద్ నగర్ పోలీసులకు అప్పగించారు. మృతుడు కృష్ణకు ఇద్దరు భార్యలు కాగా.. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఒక కూతురు ఉన్నట్టు స్థానికులు తెలిపారు.