లాపాజ్: బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 27) లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ కార్గో విమానం కుప్పకూలింది. సెంట్రల్ బ్యాంక్ కొత్తగా ముద్రించిన కరెన్సీతో ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా రన్ వేపై నుంచి జారీ ఎయిర్ పోర్టు పక్కనున్న హైవేపై క్రాష్ అయ్యి పలు వాహనాలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. కనీసం 30 మందికి పైగా గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. మృతులు విమానంలోని సిబ్బందా లేక రోడ్డుపై ఉన్న వాహనదారులా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదని వెల్లడించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రోడ్డుపై విమాన శిథిలాలు, ధ్వంసమైన కార్లు, చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. మరోవైపు విమానం క్రాష్ అయిన తర్వాత అందులోని నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడగా వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ ప్రమాదం తర్వాత అధికారులు ఎల్ ఆల్టో విమానాశ్రయానాన్ని మూసివేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
