వైవిధ్యమైన పాత్రలతో , విలక్షణమైన నటనతో సినీ ప్రపంచంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు ప్రకాష్ రాజ్. వెండితెపైనే కాదు నిజజీవితంలోనూ సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. ఇటీవల కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (KLF) తొమ్మిదవ ఎడిషన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతీయ సినీ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితిపై ఆయన చేసిన విమర్శనాస్త్రాలు హాట్ టాపిక్ గా మారాయి
మూలాలు కోల్పోతున్న బాలీవుడ్..
హిందీ సినిమాలను "మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం" లోని మైనపు బొమ్మలతో పోల్చారు ప్రకాష్ రాజ్ . అన్నీ అందంగా ఉంటాయి, అద్భుతంగా కనిపిస్తాయి.. కానీ అందులో ప్రాణం ఉండదు, అంతా ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అంటూ విమర్శించారు. హిందీ సినిమా తన మూలాలను (Roots) కోల్పోయిందని, కేవలం గ్లామర్,గ్రాండియర్ వెనుక పరుగులు తీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణాది వర్సెస్ ఉత్తరాది
మలయాళ, తమిళ సినిమాలను ప్రకాష్ రాజ్ఆకాశానికెత్తారు ప్రకాష్ రాజ్. దక్షిణ భారత సినిమాలు నేటికీ మట్టి వాసనతో, బలమైన కథాబలంతో సాగుతున్నాయన్నారు. మలయాళ సినిమాలు బడ్జెట్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తాయి. తమిళంలో వస్తున్న కొత్త తరం దర్శకులు దళిత సమస్యలు, సామాజిక వివక్ష వంటి అంశాలను ధైర్యంగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారని, ఇది ఒక గొప్ప ఆశావహ పరిణామమని ప్రకాష్ రాజ్ కొనియాడారు.
గ్రామీణ భారతాన్ని మర్చిపోయారా?
ఒకప్పుడు హిందీ చిత్రాలు సామాన్యుడికి దగ్గరగా ఉండేవి. కానీ మల్టీప్లెక్స్ విప్లవం తర్వాత అవి కేవలం పట్టణ ప్రేక్షకులను మెప్పించేలా తయారయ్యాయని ప్రకాష్ రాజ్ విమర్శించారు. "పేజ్-3 సంస్కృతిలో పడిపోయి, రాజస్థాన్, బీహార్ వంటి గ్రామీణ ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను బాలీవుడ్ మర్చిపోయింది. ఫలితంగా ప్రేక్షకులతో ఉండాల్సిన ఆ ఎమోషనల్ బాండ్ తెగిపోయింది అని అన్నారు..
దిగ్గజాల సమక్షంలో..
కేరళలోని కోజికోడ్ బీచ్‌లో జరిగిన ఈ సాహిత్య ఉత్సవం ప్రపంచస్థాయి మేధావులతో కళకళలాడింది. ప్రకాష్ రాజ్‌తో పాటు నోబెల్ బహుమతి గ్రహీతలు అబ్దుల్ రజాక్ గుర్నా, అభిజిత్ బెనర్జీ, అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలియమ్స్, వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ వంటి దాదాపు 400 మంది ప్రముఖులు ఈ వేదికను పంచుకున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. సినిమా అంటే కేవలం కలర్ ఫుల్ సెట్లు, కోట్లలో వసూళ్లు కాదని.. అది సమాజ ప్రతిబింబంగా ఉండాలని గుర్తుచేశారు. మరి ప్రకాష్ రాజ్ చేసిన ఈ విమర్శలపై బాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి!
