నార్త్ లోనూ ‘ఝుమ్మంది నాదం’

నార్త్ లోనూ ‘ఝుమ్మంది నాదం’

హీరోయిన్ అంటే ఎలా ఉండాలి?
గ్లామరస్ రోల్స్ చేయాలి. హీరోలకు సరైన జోడీలా కనిపించాలి.
మేల్ యాక్టర్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలి.
స్టార్ హీరోల దగ్గర వినయంగా మెలగాలి.
ఇవన్నీ వినీ వినీ విసిగిపోయిందామె. 
తనకు నచ్చినట్టే ఉంటానంది. నేనేంటో చూపిస్తా చూడమంది.
మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక ఫిమేల్ యాక్టర్ కూడా బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టించగలదని ప్రూవ్ చేసింది.
అందుకే తాప్సీ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయ్యింది.
 

న్యూ ఢిల్లీలో పుట్టి పెరిగిన తాప్సీ.. కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ చేసింది. కానీ మోడలింగ్‌పై ఆసక్తితో వీ చానెల్‌ నిర్వహించిన టాలెంట్ షోలో పాల్గొంది. గార్జియస్ గాళ్‌గా ఎంపికయ్యింది కూడా. ఆ తర్వాత కొన్ని యాడ్లలో నటించే అవకాశం వచ్చింది. ఎన్నో బ్యూటీ కాంపిటీషన్లలోనూ టైటిల్స్ గెల్చుకుంది. 2008 ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో మిస్ బ్యూటిఫుల్ స్కిన్‌గా సెలెక్ట్ అయింది. ఇవన్నీ ఆమెను సినీ రంగంవైపు నడిపించాయి. దర్శకుడు కె.రాఘవేంద్రరావు దృష్టిలో పడటంతో తెలుగు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది తాప్సీ. ఆ సినిమా ‘ఝుమ్మంది నాదం’. ఇదింకా రిలీజ్ కాకముందే మరో మూడు సినిమాల్లో చాన్స్ కొట్టేసింది.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పది సినిమాల వరకు చేసిన తర్వాత ‘చష్మే బద్దూర్‌‌’తో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. తర్వాత మరో నాలుగు దక్షిణాది సినిమాలు చేసి, మళ్లీ హిందీలో ‘బేబీ’ సినిమాలో నటించింది. ఇదో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ. తాప్సీ చేసిన షబానా పాత్రకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. దాంతో బాలీవుడ్ వారి దృష్టిలో పడింది. మరో రెండు మూడు సినిమాలు సౌత్‌లో చేసిన తర్వాత ‘పింక్‌’ మూవీలో చాన్స్ వచ్చింది. అంతే.. ఇక ఆ సినిమాతో బీటౌన్ వారికి ఫేవరేట్ అయిపోయింది తాప్సీ. 

నటనతో నెగ్గింది
ఎంత నార్త్ వారయినా సౌత్‌లో హీరోయిన్గా ఎదిగిన తర్వాత కూడా బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేరు. అలాంటిది తాప్సీ అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అందుకు కారణం.. కేవలం ఆమె నటన. అవును.. అందంతో కాదు, నటనతోనే నెగ్గిందామె. ‘పింక్‌’లో ఒక విక్టిమ్‌గా ఆమె నటనకి ఫిదా అయిపోయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వరుస అవకాశాలు ఇచ్చారు. అయితే మొదట హీరోలకు జోడీగానే ఆమెని ఊహించుకున్నారు. హీరోలతో సమానంగా చూడకపోవడం, ఓ యంగ్‌ హీరోతో యాక్ట్ చేయాలంటే నువ్వు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని చెప్పడం లాంటివి తాప్సీని బాధపెట్టాయి. 


కాంప్రమైజ్ అయ్యుంటే ఈరోజు తాప్సీ గురించి చెప్పుకోడానికేమీ ఉండేది కాదు. ఆమె ఎదురు తిరిగింది. నేను బాగా నటించగలను, నా టాలెంట్‌తో గెలిచి చూపిస్తానంది. కష్టపడింది. తగిన అవకాశాలు వచ్చేవరకు వెయిట్ చేసింది. ఆ పట్టుదల ఆమెని ఓడిపోనివ్వలేదు. ముల్క్, మన్‌మర్జియా, బద్‌లా, మిషన్ మంగళ్‌, శాండ్‌కీ ఆంఖ్, థప్పడ్, హసీన్ దిల్‌రుబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా, శభాష్ మిథూ.. ఇలా ఎన్నో గొప్ప అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. అవసరాన్ని బట్టి అరవయ్యేళ్ల అవ్వగా మారిపోగలదు. రన్నర్‌‌గానో, క్రికెటర్‌‌గానో తయారవ్వగలదు. అమాయక గృహిణిగా కనిపించగలదు. హత్యలు చేయడానికైనా వెనుకాడని దుర్మార్గురాలిగానూ నటించగలదు. ఎన్నో వేరియేషన్స్‌ ఉండే పాత్రలు ఎంచుకుంటుంది. అవన్నీ కూడా తాప్సీ ఎంత గొప్ప నటి అనే విషయాన్ని రుజువు చేశాయి. అయితే సక్సెస్ అవడం వేరు. హీరోలతో పని లేకుండా తన చుట్టూ తిరిగే కథలతో వందల కోట్ల క్లబులో చేరే సినిమాలు చేయడం వేరు. ఆ ఘనతను తాప్సీ సాధించింది. చివరికి షారుఖ్‌ లాంటి స్టార్ పక్కన యాక్ట్ చేయమంటూ రాజ్ కుమార్ హిరానీ లాంటి దర్శకుడు అడిగే స్థాయికి చేరుకుంది. 

మాటలు తూటాలే!

తాప్సీలో అందరికీ నచ్చే మరో విషయం.. ఆమె మాట్లాడే తీరు. చూడ్డానికి ఎంతో కూల్‌గా ఉంటుంది. పెదాలపై ఎప్పుడూ అందమైన చిరునవ్వు ఉంటుంది. కానీ తేడా వస్తే మాటలతోనే తూటాలు పేలుస్తుంది. తాప్సీ విజయాన్ని ఓర్వలేని చాలామంది ఆమెని బ్యాడ్ చేయాలని చూశారు. తలపొగరు ఎక్కువన్నారు. ఎలా నిలదొక్కుకుంటుందో చూస్తామని చాలెంజ్ చేశారు. ఎవరు ఎన్నన్నా చెదరలేదు, బెదరలేదు. ముందుకే వెళ్లింది తప్ప ఆమె అడుగు ఏనాడూ వెనక్కి పడలేదు. ఆమె ఎంత కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా ఉంటుందంటే.. ఔట్‌ సైడర్స్ కు చోటు లేదని చెప్పుకునే బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అవ్వడమే కాక, ‘ఔట్ సైడర్స్ ఫిల్మ్స్‌’ అనే బ్యానర్ను స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తోందామె.

ఆమె గట్స్‌ చూసి ముచ్చట పడనివారు లేరు. ఆమె డెడికేషన్‌ని, హార్డ్ వర్క్ను చూసి ఫిదా అవ్వనివారూ లేరు. అందుకే తాప్సీ తిరుగు లేకుండా సాగుతోంది. అప్పుడప్పుడూ సౌత్‌లో ఒక్కో సినిమా చేస్తున్నా.. బాలీవుడ్‌లో మాత్రం రాకెట్‌లా దూసుకెళ్తోంది. ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. మరి కొన్నేళ్లపాటు ఆమె హవా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే తను తాప్సీ. పడినా తిరిగి లేవడం ఆమెకి తెలుసు. మరిన్ని సంవత్సరాల పాటు.. మరెన్నో మంచి చిత్రాలతో అలరించాలని కోరుకుంటూ.. తాప్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.