పాకిస్థాన్‭లో ఆత్మాహుతి దాడి.. 28 మంది మృతి

పాకిస్థాన్‭లో ఆత్మాహుతి దాడి.. 28 మంది మృతి

పాకిస్థాన్‭లోని పెషావర్‭లో భారీ పేలుడు జరిగింది. ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 25 మంది పోలీసులు కూడా ఉన్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న మసీదులో ప్రార్ధనల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అదే సమయంలో మసీదు ప్రాంతంలో భారీ పేలుడు జరగడంతో సమీపంలోని ఓ భవనంలోని ఒక భాగం కూలిపోయింది. చాలామంది ఈ శకలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో మసీదులో 260 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి ప్రార్థన సమయంలో మసీదులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా తనను తాను పేల్చుకోవడంతోనే.. అక్కడున్న ప్రజలంతా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.