అమెరికాలో నీళ్లు, కరెంట్ లేక జనం తిప్పలు

అమెరికాలో నీళ్లు, కరెంట్ లేక జనం తిప్పలు

అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా న్యూయార్క్ నగరాన్ని మంచు ముంచెత్తోంది. దీంతో రోడ్లపై ఏకంగా రెండు, మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మంచుతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోజులు గడుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కరెంటు సరఫరా లేక జనం అంధకారంలో మునిగిపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు విమానాల రాకపోకలను రద్దు చేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు తుఫాను కారణంగా ఇప్పటి వరకు 34 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

భారీ స్థాయిలో మంచు కురుస్తుండటంతో... జనం ఇళ్లలోనే గడుపుతున్నారు. గ్రేట్ లేక్స్ ప్రాంతంలో బాంబ్ సైక్లోన్ ఏర్పడిందని... దాంతో వాతావరణం మరింత ప్రమాదకరంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. అయితే మరో వారంలో పరిస్థితి చక్కబడే అవకాశం ఉందంటున్నారు. ఇక అనేక ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో అమెరికాలోని అనేక ప్రాంతాలు అంధకారంలో బిక్కుబిక్కుమంటున్నాయి.