శంషాబాద్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు

ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా రావడమే కాకుండా సిబ్బంది అనుమతించలేదన్న కోపంతో ఏకంగా ఎయిర్ పోర్ట్ లో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఆధారంగా పట్టుబడ్డ ఆ వ్యక్తి... చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన భద్రయ్య అనే వ్యక్తి విమానాశ్రయానికి చేరుకోవడం లేట్ కావడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది లోపలకు అనుమతించలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి హైదరాబాద్ టూ చెన్నై ఇండిగో ఫ్లైట్ లో బాంబు ఉందంటూ డయల్ 100కు ఫోన్ కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు.. ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. అనంతరం డయల్ 100కు వచ్చిన ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసిన స్థానిక పోలీసులు..  ఎయిర్ పోర్టు ప్రాంగణంలోనే అగంతకుడు ఉన్నట్లు గుర్తించారు. అనుమానం వచ్చి భద్రయ్య విమానం టికెట్ ను చెక్ చేయగా.. డయల్ 100కు వచ్చిన ఫోన్ నెంబరు, విమానం టికెట్ పై ఉన్న ఫోన్ నెంబర్ ఒకటే కావడంతో భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.