
మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ 2024 మార్చి 05వ తేదీన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీంతో కొన్నేళ్లుగా జైలులో ఉన్న సాయిబాబా త్వరలో నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సాయిబాబాను 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. దేశంపై యుద్ధం చేసే కార్యకలాపాలకు పాల్పడినందుకు దోషులుగా నిర్ధారించింది. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. అయితే సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్‌పై బాంబే హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు తీర్పును న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. యాభై నాలుగేళ్ల సాయిబాబా వీల్‌చైర్‌కే పరిమితమైన దివ్యాంగుడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా సాయిబాబా చాలా కాలం పనిచేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలపై జైలు పాలు కావడంతో 2021 ఫిబ్రవరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయనను తొలగించారు