
హైకోర్టులకు ఎండాకాలంలో నెల రోజులు, దీపావళికి రెండు వారాలు, క్రిస్మస్కు వారం రోజుల సెలవులు ఉండడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎక్కువ రోజులు సెలవుల వల్ల కేసుల విచారణపై ప్రభావం పడుతోందని, కక్షిదారుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. అయితే ఈ పిల్‌పై దీపావళి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, ఆర్ఎన్ లద్దాలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తెలిపింది. కాగా, ఈ నెల 22 నుంచి నవంబర్ 9 వరకు హైకోర్టుకు దీపావళి సెలవులు ఉన్నాయి.
ముంబై: కోర్టులకు ఎక్కువ రోజులు సెలవులు ఉండడాన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సబినా లక్డావాలా ఫైల్ చేశారు. హైకోర్టు ఎక్కువ రోజులు సెలవులు తీసుకోవడం వల్ల కేసుల విచారణపై ప్రభావం పడుతోందని, కక్షిదారుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని అందులో పేర్కొన్నారు.
ఈ దీపావళికి హైకోర్టు పూర్తి స్థాయిలో పని చేసేలా చూడాలని, అన్ని కేసులను విచారించేందుకు తగిన సంఖ్యలో జడ్జీలను నియమించాలని, అన్ని పిటిషన్లను స్వీకరించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘‘జడ్జీలు, లాయర్లు సెలవులు తీసుకోవద్దన్నది పిటిషనర్ ఉద్దేశం కాదు. సెలవు రోజుల్లో పూర్తిగా కోర్టులే బంద్ కావొద్దు. అవి ఏడాదంతా నడవాలి” అని సబినా తరఫు లాయర్ మాథ్యూస్ హైకోర్టుకు తెలిపారు. ఈ పిల్ పై దీపావళి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, ఆర్ఎన్ లద్దాలతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తెలిపింది. విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. కాగా, ఈ నెల 22 నుంచి నవంబర్ 9 వరకు హైకోర్టుకు దీపావళి సెలవులు ఉన్నాయి. హైకోర్టులకు ఏటా ఎండాకాలంలో నెల రోజులు, దీపావళికి 2 వారాలు, క్రిస్మస్కు వారం రోజుల సెలవులు ఉంటున్నాయి. ఈ టైమ్ లో అత్యవసర కేసుల విచారణ కోసం స్పెషల్ వెకేషన బెంచ్ లు పని చేస్తున్నాయి.