హైదరాబాద్‎లో పేలుళ్లకు ఏపీలో బాంబుల కొనుగోలు..!

హైదరాబాద్‎లో పేలుళ్లకు ఏపీలో బాంబుల కొనుగోలు..!

హైదరాబాద్‌‌‌‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పట్టుబడ్డ ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్‌‌‌‌ఉర్‌‌‌‌ ‌‌‌‌రెహ్మాన్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ బోయిగూడకు చెందిన సయ్యద్‌‌‌‌ సమీర్‌‌‌‌.. నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం బోయిగూడలో మూడు రోజులు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. బాంబుల తయారీ కోసం టిఫిన్‌‌‌‌ బాక్సులు, వైర్లు,రిమోట్‌‌‌‌ సెల్స్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్ చేసినట్లు ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

ఏపీలో పేలుడు పదార్థాల కొనుగోలు

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేస్తే దొరికిపోతామనే  అనుమానంతో సిరాజ్‌.. ఏపీలోని రిమోట్‌ ఏరియాల్లో కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడు. గత నెలలో రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పలుమార్లు బ్లాస్టింగ్‌ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లోనూ పేలుడు పదార్థాలు ఆర్డర్ చేశారు. పోలీసులకు అనుమానం రాకుండా అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం సహా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆన్‌లైన్ సెర్చ్‌ ఆపరేషన్‌లో సిరాజ్‌, సమీర్‌  పట్టుబడ్డారు. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సమీర్ నివాసం ఉండే బోయిగూడ పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు.  

సమీర్‌‌తో కాంటాక్ట్​లో ఉన్న స్నేహితులు, సోషల్‌మీడియా ఫాలోవర్స్‌ వివరాలు సేకరిస్తున్నారు. ఏపీ పోలీసులతో కలిసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలని రెక్కీ చేసిన విషయంతో పాటు ఇంకా అనేక కీలకమైన విషయాలు పోలీసులకు చిక్కే అవకాశం ఉంది. ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు బాంబ్​బ్లాస్టింగ్​ రిహార్సల్స్‌‌‌‌ నిర్వహించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌‌‌‌లో డమ్మీ బ్లాస్టింగ్స్, ఆ తర్వాత వరుస పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో సమీర్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌ను  కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌ శనివారం అరెస్ట్ చేసింది.