
- హాజరైన ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ, చైర్మన్ వివేక్ వెంకటస్వామి
ముషీరాబాద్, వెలుగు : హైదరాబాద్.. బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో గురువారం బోనాల వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు యాజమాన్యం ఈ ఉత్సవాల్లో పాల్గొంది. ముఖ్య అతిథులుగా హాజరైన సినీ ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ, విద్యా సంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి, కరస్పాండెంట్ సరోజ వివేక్‌తో పాటు విశాక జేఎండీ వంశీకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బోనాల పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్స్‌కు కావాల్సిన సహాయ.. సహకారాలు అందిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించి సాంకేతిక అంశాలతో అవసరమైన మేరకు సలహాలు, సూచనలు ఇస్తామని వివరించారు. సినీ పరిశ్రమల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామన్నారు.
బాహుబలి సినిమా టెక్నాలజీపై చర్చ
బాహుబలి సినిమా తీసేటప్పుడు ఇంత గొప్ప సాంకేతిక అంశాలను చూపించాలనే ఆసక్తి ఎలా కలిగిందని విద్యా సంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి ప్రశ్నించగా.... స్పందించిన ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ.. పట్టుదల, బలమైన కోరిక, పరిశ్రమపై మక్కువ, దర్శకుల సౌజన్యం, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైందని జవాబిచ్చారు. నూతన సాంకేతికను ఉపయోగించి సినిమా తీయడంతోనే ఇంత పెద్ద విజయం దక్కిందన్నారు. అంతర్జాతీయ సమాజానికి మన తెలుగు సినిమా దిశా.. దశను చాటి చెప్పాలన్న బలమైన కోరిక తనను ఈ స్థాయికి చేర్చిందని తెలిపారు. ఈ సినిమా ఇండియా సరిహద్దులు దాటిందని గుర్తు చేశారు. అనంతరం జేఎండీ వంశీకృష్ణ, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కొంత సేపు విద్యార్థులతో ముచ్చటించారు.
బోనాలు సమర్పించిన విద్యార్థులు
డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాల మధ్య అమ్మవారికి స్టూడెంట్స్ బోనాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. విద్యార్థులు వేసిన పోతరాజుల గెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి వేషధారణలో విద్యార్థులు చేసిన స్కిట్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు, విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, సిబ్బంది, లెక్చరర్లు, టీచర్లు పాల్గొన్నారు.