అల్వాల్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

అల్వాల్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • బోనాల చెక్కుల పంపిణీ  సందర్భంగా కుర్చీల గొడవ  
  • పోటాపోటీ నినాదాలు.. ఘర్షణ, తోపులాట
  • ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలు  
  • పోలీస్​స్టేషన్లలో ఫిర్యాదులు 
  • రాత్రి మల్కాజిగిరికి మైనంపల్లి, ఎమ్మెల్యే రోహిత్​
  • దమ్ముంటే రావాలని ‘మర్రి’కి సవాల్​

 అల్వాల్, వెలుగు: మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్​లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. బాలాజీ వేంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తుండగా మల్కాజిగిరి, అల్వాల్ కు చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కుర్చీలు ఇవ్వలేదు. 

అప్పటికే స్టేజీపై కాంగ్రెస్​కార్యకర్తలు కూర్చొని ఉండడంతో ఇరు వర్గాల వారు నినాదాలు చేసుకుంటూ తోసుకున్నారు. తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో చెక్కుల పంపిణీ కోసం వచ్చిన విప్ ఐలయ్య వెళ్లిపోయారు. తర్వాత అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్​రెడ్డి పీఎస్​కు రాగా, కాంగ్రెస్​కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. మర్రి రాజశేఖర్​రెడ్డి దౌర్జన్యం నశించాలంటూ నినదించారు. బీఆర్​ఎస్​కార్యకర్తలు కూడా వస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు మర్రి రాజశేఖర్​రెడ్డిని భారీ బందోబస్తు మధ్య తరలించారు. ఈ సందర్భంగా పోటా పోటీ నినాదాలతో పీఎస్​వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

కాంగ్రెస్సోళ్లే దాడి చేసిన్రు : ఎమ్మెల్యే మర్రి

చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే కాంగ్రెస్ లీడర్లు తమ పార్టీ శ్రేణులపై దాడి చేశారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. అసలు ప్రోటోకాల్ పాటించే సంప్రదాయం ఉందా లేదా అని ప్రశ్నించారు. మహిళా నాయకులు సీట్లడిగితే ఇచ్చే సంస్కృతి కూడా లేదన్నారు. వారితో అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ ఘటనపై సీపీని, అవసరమైతే సీఎంను కూడా కలుస్తామన్నారు. అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తామన్నారు.

మల్కాజిగిరికి చేరిన పంచాయితీ

అల్వాల్‌‌‌‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లొల్లి రాత్రికి మల్కాజిగిరికి చేరింది. అల్వాల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్​ఘర్షణలో ఒక బీఆర్ఎస్​ కార్యకర్త గాయపడడంతో ఓ పార్టీకి చెందిన అతడి బంధువు మైనంపల్లికి ఫోన్​చేశాడు. దమ్ముంటే మల్కాజిగిరి రావాలని సవాల్​విసిరాడు. ఈ సవాల్​ను స్వీకరించిన మైనంపల్లి హనుమంతరావు, ఆయన కొడుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు రాత్రివేళ పెద్ద సంఖ్యలో మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఇరుపార్టీల వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు మల్కాజిగిరిలోని ఆనంద్‌‌‌‌బాగ్ లో ఉన్న తమ పార్టీ కార్యాలయంలో తిష్టవేశారు. చివరికి ఇరువర్గాలను పోలీసులకు సర్ది చెప్పి పంపించారు.