
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో బోనాలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసం చివరి ఆదివా రం కావడంతో భక్తులు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుకున్నారు. డప్పుల దరువు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న టెంపుల్, మీరాలం మండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయాలతో పాటు అన్ని పురాతన దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలివెళ్లారు. లాల్ దర్వాజ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పట్టువస్ర్తాలు సమర్పించారు. అదేవిధంగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి, మీరాలం మండి, సబ్జీ మండి మహంకాళి, అక్కన్న మాదన్న, కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ అమ్మవార్లకు కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ తదితరులు లాల్‌దర్వాజాలో అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ నేత విజయశాంతి గౌలిపురా మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. మల్కాజిగిరిలోని కట్ట మైసమ్మ, ముసారాంబాగ్ లోని పోచమ్మ అమ్మవార్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.
బోనాలకు 15 కోట్లు ఇచ్చినం: ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. బోనాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే లాల్ దర్వాజ ఆలయం అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించామని, త్వరలో పనులు జరుగుతాయన్నారు. ప్రపంచంలో లేని పండుగలు తెలంగాణలో జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి దయతో తెలంగాణ మరింత ముందుకు పోతుందని మంత్రి మహమూద్ అలీ అన్నారు.
అందరూ బాగుండాలె: కిషన్ రెడ్డి
బోనాల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నగ రంలో పలు ఆలయాలను దర్శించారు. అంబర్ పేట్ కనకదుర్గమ్మ, ఖైరతాబాద్, బల్కంపేట ఎల్లమ్మ, షేక్ పేట్ లోని పోచమ్మ ఆలయాలను ఆయన సందర్శించారు. ప్రజలందరికీ ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించాలని, దేశం మరింత సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్ తెలిపారు.