- పోతరాజుల విన్యాసాలు, శివాలెత్తనున్న శివసత్తులు
- దద్దరిల్లనున్న భాగ్యనగరం
- గోల్కొండ జగదాంబికకు తొలిబోనం
- ఆగస్టు 2న లష్కర్జాతర,
- 9న పాతబస్తీలో వైభవం
హైదరాబాద్ సిటీ, వెలుగు:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రత్యేకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మకు అద్దం పట్టే అతిపెద్ద జానపద పండుగ బోనాలు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని అమ్మవారికి బోనాలతో మొక్కులు సమర్పించుకునే గొప్ప ఉత్సవమిది. ఈ సంబురానికి భాగ్యనగర ఆలయాలన్నీ ముస్తాబు కాగా, హైదరాబాద్ వీధులు బోనాల పాటలతో మార్మోగనున్నాయి.
ప్రతి ఇల్లు పసుపు, కుంకుమలు, వేప ఆకులతో పచ్చిబోనం తయారు చేసే మహిళలతో కళకళలాడనున్నది. ‘పిల్లా జెల్లా సల్లంగుండాలి తల్లీ’ అని మనసారా మొక్కుకుంటూ, నెత్తిన బోనం ఎత్తుకుని అమ్మవారి ఆలయాల వైపు సాగే అతివలతో నగర వీధులు ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకోనున్నాయి. శివాలూగే శివసత్తుల పూనకాలు, కళ్లెదుటే భవిష్యత్తును ఆవిష్కరించే ‘రంగం’ భవిష్యవాణి జాతరకు మరింత భక్తిభావాన్ని జోడించనుంది. వీటికితోడు పోతరాజుల కొరడా దెబ్బల వీరంగం, ఒంటిపై రంగులు పూసుకొని లయబద్ధంగా నృత్యం చేసే పులిరాజుల విన్యాసాలు బోనాల జాతరకే హైలైట్‌గా నిలవనున్నాయి.
మహమ్మారి అంతంతో ఆరంభం
ఈ ఆషాఢ జాతర చారిత్రక హైదరాబాద్, సికింద్రాబాద్నగరాల్లో రెండు వందల ఏండ్లకు ముందే మొదలైంది. 1813లో నగరంలో కలరా మహమ్మారి ప్రబలినప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ టైంలో సికింద్రాబాద్ మిలిటరీ బెటాలియన్‌లో పని చేసే సూరిటి అప్పయ్య తన దళంతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీపై వెళ్లాడు. అక్కడి మహంకాళి అమ్మవారిని దర్శించుకొని తన నగరంలో జనాలను కాపాడితే సికింద్రాబాద్‌లో ఉజ్జయిని అమ్మవారి పేరిట ఆలయాన్ని కట్టిస్తానని మొక్కుకున్నాడు. కలరా ప్రభావం తగ్గడంతో 1815 జులైలో మొదట చెక్క విగ్రహం తయారు చేయించి లష్కర్లో ప్రతిష్టించాడు. తర్వాత ప్రస్తుతమున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
తొట్టెల సమర్పణ హైలెట్
జాతరలో ‘తొట్టెలు’ అత్యంత పవిత్రమైన సాంస్కృతిక ఆనవాళ్లు. సంతానం కలగాలని, బాలారిష్టాలు తొలగాలని అమ్మవారికి వెదురు బద్దలతో చేసిన ఊయల సమర్పించడాన్ని ‘తొట్టెలు’ అంటారు. రంగురంగుల పేపర్లు, పూలతో అందంగా తయారు చేసే చిన్న దేవాలయం లేదా గోపురం వంటి నిర్మాణం ఇది.
ఏడుగురు అక్కాచెల్లెళ్లు
ఏటా బోనాల సందర్భంగా నగరంలోని పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ,పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కా చెల్లెళ్ల దేవాలయాలన్నీ ముస్తాబు చేస్తారు.
బోనాలతో ఆలయానికి వెళ్లే మహిళలను అమ్మవారు ఆవహిస్తుందని భక్తుల నమ్మకం. వాళ్లు నడిచి వెళ్తున్నప్పుడు కొందరు భక్తులు వారి పాదాలను నీళ్లతో కడుగుతారు.
బోనంగా తెచ్చిన ప్రసాదాన్ని ఒక దగ్గర కుప్పగా పోయడాన్ని ‘వడి’ అంటారు. ఆలయాలకు వెళ్లిన వాళ్లంతా అమ్మవారికి బెల్లం పానకం పోస్తారు. దాన్ని ‘సాక’ అంటారు.
పండుగ తర్వాత అమ్మవారిని మంగళ వాయిద్యాలతో వీధుల్లో ఊరేగించడాన్ని ‘సాగనంపడం’ అంటారు.
బోనాలు ఎప్పుడు ఎక్కడ?
చారిత్రక గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో జాతర ప్రారంభం కానుంది. వచ్చే నెల 13 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో గోల్కొండలో, ప్రతి ఆదివారం నగరంలో ఒక్కో అమ్మవారి ఆలయంలో జాతర సాగనుంది. 19న గోల్కొండ, ఆగస్టు 2న లష్కర్లో బోనాల జాతర ఉంటుంది. 3న ‘రంగం’ భవిష్యవాణి వినిపిస్తారు. 9న పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణతో కోలాహలం శిఖరాగ్రానికి చేరుకోనుంది. 13న గోల్కొండలో పూజలు, బోనాలతో ఘట్టం ముగుస్తుంది.
ఘటాల ఊరేగింపు
పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల్లో ఘటాల ఊరేగింపునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. బోనాల పండుగ చివరి ఘట్టం ఈ ఘటాల ఊరేగింపుతో ముగుస్తుంది. అమ్మవారి ముఖచిత్రంతో అలంకరించిన రాగి కలశాన్ని(ఘటం) పూజారి తలపై మోస్తూ డప్పు చప్పుళ్లు, తీన్‌మార్ డ్యాన్సుల మధ్య ఊరేగిస్తారు. పాతబస్తీలోని వివిధ ఆలయాల ఘటాలన్నీ(ముఖ్యంగా అక్కన్న, మాదన్న ఆలయ ఘటం ఏనుగుపై అంబారీగా ముందు సాగుతుంది) కలిసి చారిత్రాత్మక ఊరేగింపుగా సాగి, చివరకు అఫ్జల్‌గంజ్ సమీపంలోని మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు.
పోతరాజులు..
అమ్మవార్ల తమ్ముడినే పోతరాజుగా చెప్తారు. పోతరాజు రాగానే ఉత్సవాల్లో ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. ఒంటికి పసుపు, కుంకుమ పూసుకుని, డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా చేసే వీరంగం జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
బోనం అంటే?
బోనం అంటే ‘భోజనం’ అని అర్థం. ఇది తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతలకు (మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ) సమర్పించే పవిత్రమైన నైవేద్యం. మహిళలు కొత్త బియ్యం, పాలు, బెల్లం కలిపి వండిన పరమాన్నాన్ని మట్టి లేదా రాగి కుండలో ఉంచుతారు. దీనిని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి, కుండపై దీపం వెలిగిస్తారు. ఈ బోనాన్ని తలపై పెట్టుకొని, డప్పు వాయిద్యాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి గుడికి తీసుకెళ్లి సమర్పిస్తారు.
అక్కన్న, మాదన్నల తొలి బోనం
గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో మంత్రులు అక్కన్న, మాదన్న గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం సమర్పించి పూజలు ప్రారంభించారని చరిత్ర చెబుతోంది. కుతుబ్షాహీలు ఈ పూజలు ప్రతి ఏడాది జరుపుకునేందుకు అనుమితినివ్వడంతో ఆ ఆచారం అలాగే కొనసాగుతూ వస్తోంది. అమ్మవారి బోనాలను ఘనంగా జరుపుకోవడంలో కీలక పాత్ర పోషించిన అక్కన్న, మాదన్నల పేరుపై పాతబస్తీలో గుళ్లు కూడా కట్టి కృతజ్ఞత చూపారు. ఇక్కడ బోనాలు కూడా సమర్పిస్తారు.
