అక్కడ గుడే ఉండదు.. బోనాల చెక్కులు వస్తాయి.. 8ఏళ్లుగా నిధులు గోల్మాల్

అక్కడ గుడే ఉండదు.. బోనాల చెక్కులు వస్తాయి.. 8ఏళ్లుగా నిధులు గోల్మాల్
  • లేని గుళ్లకు బోనాల చెక్కులు 
  • విచారణ జరపాలన్న కాంగ్రెస్ నేత ఐత చిరంజీవి

పద్మారావునగర్, వెలుగు: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ఇచ్చే చెక్కులు కొన్నేండ్లుగా పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బన్సీలాల్​పేట డివిజన్​లోని పద్మారావునగర్​లో ఓ అపార్ట్​మెంట్ పక్కనున్న ఖాళీ స్థలంలో  టెంపుల్ పేరుపై ఓ వ్యక్తి గత 8 ఏండ్లుగా ప్రభుత్వం నుంచి బోనాల చెక్కులను పొందుతున్నట్లు కాంగ్రెస్ నేత ఐత చిరంజీవి ఆరోపించారు. 

తమ ఫిర్యాదుతో గురువారం ఎండోమెంట్ ఇన్​స్పెక్టర్​ సైదులు ఈ వ్యవహారంపై విచారణ జరిపారన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. డివిజన్​లోని మరికొన్ని చోట్ల ఒకే టెంపుల్​పై రెండేసి చెక్కులను తీసుకున్నారన్నారు. పద్మారావునగర్​లో ఒకే టెంపుల్​నుంచి ఒకే వ్యక్తి  ఏటా రెండేసి చెక్కులను తీసుకుంటున్నారని ఆరోపించారు. 

బీజేఆర్​ నగర్​లో ఓ ఆలయం పేర ఒకే టెంపుల్​ నుంచి ఓ వ్యక్తి  ఏటా రెండేసి చెక్కులను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా కొన్ని టెంపుల్స్​కు కోడ్​ లేకుండానే అధికారులు ఆయా వ్యక్తులకు రెండేసి చెక్కులను ఇస్తున్నారని తెలిపారు. డివిజన్​ లో మొత్తం 26 ఆలయాలకు సంబంధించిన లక్షలాది రూపాలయల బోనాల చెక్కుల గోల్​మాల్ జరిగిందని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు.