- గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కు అందజేసిన ప్రభుత్వం
- 11,65,995 మంది విద్యార్థుల కోసం అందుబాటులో నోట్‌బుక్స్
- రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న బడులు
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కు తొలిరోజే పుస్తకాలు, యూనిఫామ్స్ అందాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు, ప్రైవేటు బడులు తెరుచుకున్నాయి. 49 రోజుల సమ్మర్ హాలిడేస్ తర్వాత బుధవారం స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బడుల్లో తొలిరోజు పండుగ వాతావరణం నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లో పిల్లలకు పుస్తకాలు, నోట్ బుక్స్, ఒక జత యూనిఫామ్ అందించారు.
దీంతో పిల్లల్లో ఆనందం వెల్లివిరిసింది. సర్కారు స్కూళ్లలో ఎన్రోల్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రైవేట్మోజు నుంచి బయటపడేలా పేరెంట్స్ లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
21,19,439 మంది స్టూడెంట్స్‌కు యూనిఫామ్స్
స్కూళ్లు తెరుచుకున్న బుధవారం రోజున సర్కారు విద్యాసంస్థల్లో చదివే 21,19,439 మంది స్టూడెంట్స్‌కు ఒక జత యూనిఫాం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెలాఖరులోగా రెండో జత కూడా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. కాగా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు 1,11,97,976 నోట్‌బుక్స్ ఇవ్వనున్నారు. తొలిరోజు 11,65,995 మంది స్టూడెంట్స్‌కు పంపిణీ కోసం ఈ నోట్ పుస్తకాలు అందుబాటులో ఉంచారు.
ఈ సంవత్సరం 25,80,291 మంది విద్యార్థులకు 1,50,17,812 పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. మరోపక్క ఒకటి నుంచి ఐదో తరగతి చదివే10,09,464 మంది విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రభుత్వం పరిధిలో నడిచే సర్కారు, లోకల్ బాడీ, ఎయిడెడ్, వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని వారందరికీ వాటిని అందించనున్నది. ఈ ఏడాది యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. దీని ద్వారా సుమారు 30 వేల సంఘాలకు ఉపాధి లభించింది. తొలిరోజు బడుల రీఓపెన్ కార్యక్రమంలో పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.