53ఏళ్ల వయసులో ఏడో బిడ్డకు తండ్రయిన బోరిస్ జాన్సన్

53ఏళ్ల వయసులో ఏడో బిడ్డకు తండ్రయిన బోరిస్ జాన్సన్

బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ 59 ఏళ్ల వయసులో ఏడో బిడ్డకు తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఆయనతో పాటు ఆయన భార్య క్యారీ ప్రకటించారు. జూలై 5న ఉదయం 9.15గంటలకు తమకు మగబిడ్డ పుట్టాడని వెల్లడించారు. తమ బిడ్డకు ఫ్రాంక్ ఆల్‌ఫ్రెడ్ ఒడిస్సియస్ జాన్సన్ అని నామకరణం చేశామంటూ 35ఏళ్ల క్యారీ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చారు.

తన భర్త పురాతన గ్రీకు పురాణాలను ఇష్టపడతాడని, అందుకే వారు ఒడిస్సియస్ అనే పేరును ఎంచుకున్నారని క్యారీ తెలిపారు. తమ పెద్ద పిల్లలు తమ కొత్త బిడ్డను కౌగిలించుకోవడం, వారు అలా  మురిసిపోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు డెలివరీ చేసిన ఎన్ హెచ్ఎస్ ప్రసూతి బృందానికి క్యారీ ధన్యవాదాలు తెలియజేశారు.  

ఏప్రిల్ 2020లో బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో కొవిడ్ -19తో బాధపడుతున్నపుడు వారికి మొదటి కుమారుడు విల్ఫ్రెడ్ జన్మించాడు. డిసెంబరు 2021లో జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కుమార్తె రోమీ జన్మించింది. ఇదిలా ఉండగా బోరిస్ జాన్సన్ ఇప్పటివరకు ముగ్గురిని వివాహం చేసుకున్నారు. అతని రెండో భార్యతో నలుగురు పిల్లలు కనగా.. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న క్యారీతో తాజాగా పుట్టిన బిడ్డతో కలిపి అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.