జైల్లో పుట్టక.. తల్లి ప్రేమ నోచుకోలేదు.. అయినా లక్ష్యం కోసం..  

జైల్లో పుట్టక.. తల్లి ప్రేమ నోచుకోలేదు.. అయినా లక్ష్యం కోసం..  

మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఒక భాగం. అదే కష్టాలు జీవితమంతా వెంటాడితే, ఆ ప్రయాణం వర్ణనాతీతం. అలాంటి భయానక జీవితం ఓ యువతి పుట్టుకతోనే ఆరంభమైంది. ఆమె పుట్టే సమయానికి తల్లి జైలు జీవితాన్ని అనుభవిస్తోంది. తండ్రి ఒంటరివాడు. పుట్టిన బిడ్డను అపురూపంగా చేతుల్లోకి తీసుకున్న తండ్రి, తనను గుండెల్లో పెట్టుకొని పెంచి, పెద్ద చేశాడు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు. అవేవీ ఆ చిన్నారిని లక్ష్యానికి దూరం చేయలేకపోయాయి. లాయర్ కావాలన్నదే తన కల. అలా అనుకున్నట్లుగానే నేడు ఆ యువతి హోవార్డ్ లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో అడ్మిషన్ పొందింది. 

అరోరా స్కై కాస్ట్నర్(18) జన్మించినప్పుడు ఆమె తల్లి అమెరికాలోని గాల్వెస్టన్ కౌంటీ జైలులో శిక్ష అనుభవిస్తోంది. తండ్రికి సమాచారమిచ్చిన జైలు అధికారులు.. అప్పుడే పుట్టిన ఆ పసికందును తండ్రి చేతుల్లో పెట్టారు. ఆ సమయంలో చిన్నారి గుక్క పట్టి ఏడుస్తోంది. తండ్రికి ఏం చేయాలో పాలుపోలేదు. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొన్న ఆ తండ్రి.. చిన్నారిని తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. ఆమెను తల్లిలా లాలించి పెంచి.. పెద్ద చేశాడు. ఈ ప్రయాణంలో వారికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ కాస్ట్నర్ ఎప్పుడు తన లక్ష్యాన్ని మరువలేదు. తల్లిని తలచుకుంటూనే తన విద్యను కొనసాగించింది. ప్రతి క్లాసులోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చోటు సంపాదించింది. లా డిగ్రీని అభ్యసించబోతోంది.