
టీమిండియా, జింబాబ్వే చేతిలో ఓటమి ప్రతీకారాన్ని పాకిస్తాన్ ..నెదర్లాండ్స్ బ్యాట్స్ మన్ పై తీర్చుకుంది. మ్యాచ్ ప్రారంభం అయినప్పటి నుంచి పాక్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో పాక్ పూర్తిగా పట్టు బిగించింది. పాక్ బౌలర్ల బంతులకు నెదర్లాండ్ బ్యాటర్లు వణికిపోయారు. నిప్పులు చెరిగే బంతులతో ..నెదర్లాండ్స్ బ్యాటింగ్ కుప్పకూలింది. కేవలం 20 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది.
నిప్పులు చెరిగారు..
బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి పాక్ బౌలర్ల ధాటికి..నెదర్లాండ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జట్టు మొత్తంలో ఇద్దరు బ్యాట్స్ మన్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. కొలిన్ అక్కెర్మన్- 27 పరుగులు కొట్టగా...,కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్- 15 పరుగులు చేశారు. మిగిలిన వారు 10 పరుగులు కూడా చేయలేదు. పాక్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులను సంధించారు. తమ బుల్లెట్ బంతులతో నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్‌ను వణికించారు.
నెదర్లాండ్స్ బ్యాట్స్‌మన్‌కు గాయం
పాక్ బౌలింగ్ లో నెదర్లాండ్స్ బ్యాట్స్ మన్ తీవ్రంగా గాయపడ్డాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఓపెనర్ బాస్ డీ లిడెకు గాయమైంది. రవూఫ్ సంధించిన రాకాసి బౌన్సర్‌ను ఆడబోయిన లిడె ..బంతి మిస్ అయి అతని ముఖాన్ని తాకింది. ఈ బంతి హెల్మెట్ గ్రిల్స్ కూడా అడ్డుకోలేకపోయింది. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బాల్... లిడె కంటి కింద తగిలింది. బాల్ వేగానికి హెల్మెట్ క్రాక్ అయింది. దీంతో లిడె కొద్దిసేపు క్రీజ్‌లోనే కూర్చుండి పోయాడు.