నేను అమ్మా నాన్న కుట్టీని..

నేను అమ్మా నాన్న కుట్టీని..

నిఖత్ జరీన్..వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి..అసాధారణ ప్రతిభతో..ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. టాలెంట్కు శ్రమ తోడైతే..విజయం వరిస్తుందన్న  దానికి నిఖత్ జరీనే నిదర్శనం. అందుకే ఏడాదిలో మూడు స్వర్ణ పతకాలతో ప్రపంచ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. కామన్వెల్త్ లో గోల్డ్ పంచ్ తో దేశ యువతకు స్పూర్తిగా నిలిచిన నిఖత్ జరీన్.. కామన్వెల్త్ ప్రయాణం..భవిష్యత్ లక్ష్యాలను వీ6 వెలుగుతో పంచుకుంది.

కామన్వెల్త్లో  స్వర్ణం సాధించడం ఎలా ఉంది..?
చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్ లో మరింతగా కష్టపడి మరిన్ని మెడల్స్ సాధించేందుకు కృషి చేస్తా.

మెడల్ సాధించినందుకు ఎలాంటి ప్రశంసలు దక్కాయి..?
సోషల్ మీడియా వేదికగా..ఫోన్ల ద్వారా ఎంతో మంది నాకు శుభాకాంక్షలు చెప్పారు. ఆనందంగా ఉంది. అందరి ప్రేమ, అభిమానాలను చూసినప్పుడు సంతోషంగా అనిపించింది. వారి ఆశీర్వాదాలు, ప్రేమ వల్లే ఇంతటి విజయాన్ని సాధించాను.

ప్రధాని మోడీకి గ్లోవ్స్ అందించారు..మోడీ ఏమన్నారు..?
ప్రధాని మోడీతో సంభాషణ బాగా అనిపించింది. కామన్వెల్త్లో గెలిచిన వారందరితో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాటలతో చాలా స్పూర్తి పొందాను. ప్రపంచంలో  ఏ దేశ ప్రధాని కూడా ఇలా క్రీడాకారులతో సమావేశం కారు. కానీ మోడీ మాత్రం గేమ్స్కు ముందు...గేమ్స్ తర్వాత అందరితో కలవడం క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపింది.

అమ్మకు పుట్టిన రోజు బహుమతిగా కామన్వెల్లో  గోల్డ్ మెడల్ తెస్తా అన్నారు...గోల్డ్ ఇచ్చాక  అమ్మ రియాక్షన్ ఏంటి..?
అమ్మ పుట్టిన రోజు సమయంలో నేను అమ్మదగ్గర లేను. కామన్వెల్త్లో ఉన్నాను. అయితే ఆ సమయంలో పుట్టిన రోజు బహుమతిగా స్వర్ణం తెస్తానని అమ్మకు మాటిచ్చాను. నేను స్వర్ణం గెలిచనప్పుడు అమ్మ చాలా సంతోషించింది. మెడల్తో ఇంటికి వచ్చాక అమ్మకు స్వర్ణం ఇచ్చినప్పుడు ఆమె మరింత ఆనందించింది.  ఆమెతో బిర్యానీ వండించుకుని తిన్నాను. 

అమ్మాయిలు నాన్న కుట్టీలు అంటారు కదా..మీరు అమ్మ కుట్టీనా..?
లేదు నేను ఇద్దరు కుట్టీని..అమ్మా,నాన్న  నాకు ఇద్దరు ముఖ్యమే. నాన్న అయితే నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతీ సమయంలో ఆయన నా వెంట ఉన్నారు. 

సిస్టర్ ఫిజియో..ఆమె సపోర్ట్ ఎలా ఉండేది...?
నా ఫ్యామిలీ నన్ను చాలా సపోర్ట్ చేశారు. కొవిడ్ సమయంలో జిమ్లు అన్నీ బంద్ అయ్యాయి. ఇంట్లోనే ప్రాక్టీస్ చేశా.  చిన్న చిన్న గాయాలు అయితే..నా సిస్టరే నాకు ట్రిట్ మెంట్ చేసేది. ఇంతగా నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండటం ఆనందంగా ఉంది.

52 కేజీల నుంచి 50 కేజీలకు తగ్గారు. ఇందుకు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నారా..?
బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డా. 52 కేజీలున్నప్పుడు ఎలా మెయింటేన్ చేశానో..50 కేజీలు ఉన్నప్పుడు కూడా స్పీడ్, ఇతర సామర్థ్యం కూడా అలాగే మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. ఇది కష్టం. కానీ మంచి డైట్ ఫాలో అయి..బరువు తగ్గాను. దాని వల్లే కామన్వెల్త్లో మంచిగా పర్ఫాం చేశా.  వరల్డ్ ఛాంపియన్ షిప్లో ఎలాగైతే ఆడానో..అలాగే కామన్వెల్త్లోనూ ఆడాలని నిర్ణయించుకున్నా. విజయం సాధించా. 

కామన్వెల్త్కు..వరల్డ్ ఛాంపియన్ షిప్కు తేడా ఎలా ఉంది..?
కామన్వెల్త్తో పోల్చుకుంటే..వరల్డ్ ఛాంపియన్ షిప్కు కష్టపడాలి. దాన్ని మినీ ఒలింపిక్స్ అంటాము. వరల్డ్ బెస్ట్ బాక్సర్స్ వస్తారు. కానీ కామన్వెల్త్లో  కేవలం కామన్వెల్త్ కంట్రీల బాక్సర్లే వస్తారు. ఇందులో ఇంగ్లాండ్, ఐర్లాండ్ నుంచే గట్టి పోటీ ఎదురవుతుంది. వారిద్దరిని సెమీస్, ఫైనల్స్తో ఓడించి స్వర్ణం సాధించాను. 

అమ్మాయిలు స్పోర్ట్స్ అంటే భయపడతారు. కానీ అమ్మాయి అయి ఉండి పైగా బాక్సింగ్లో గోల్డ్ సాధించడం ఎలా అనిపిస్తుంది..?
నా బాక్సింగ్ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వలేదు.  నేనెప్పుడు నన్ను నమ్ముతా.  చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేశాను..ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. 

హైదరాబాద్లో బాక్సింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి..?
హైదరాబాద్ అంటే బ్యాడ్మింటన్ అంటారు. హైదరాబాద్ అంటే అందరికి బ్యాడ్మింటన్ హబ్గా తెలుసు. అయితే హైదరాబాద్ బాక్సింగ్ హబ్గా వెలుగొందాలనుకుంటున్నా.  హైదరాబాద్లో బాక్సింగ్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎల్బీ స్టేడియంలోనే రింగ్ ఉంది. ఎక్కడా లేదు. ఒక బాక్సర్గా..తెలంగాణాలో బాక్సింగ్ ఆట అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.  ఇందుకు గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి.  వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బాక్సింగ్లో  గోల్డ్ సాధించిన మొదటి తెలంగాణ ఉమెన్ అథ్లెట్ని..ఇక్కడ బాక్సింగ్ను డెవలప్ చేస్తే మరింత మంది బాక్సర్లు తయారవుతారు.
 
స్పోర్ట్స్ను ఎంపిక చేసుకుని యూత్కు ఏం చెప్తారు...?
నేను కూడా  ఒక చిన్న జిల్లా నుంచి వచ్చాను. కష్టపడి..శ్రమపడి..చిన్న జిల్లా నుంచి వచ్చి ఇవాళ దేశం గర్వపడేలా పతకాలు సాధిస్తున్నా. మీరు కూడా స్పోర్ట్స్ లోకి రండి..వచ్చి దేశంగర్వించదగ్గర విజయాలు సాధించండి..మిమ్మల్ని మీరు నమ్మండి..కష్టపడండి..కష్టపడకపోతే ఏది దొరకదు..కష్టపడితేనే సక్సెస్ లభిస్తుంది.

ఒలింపిక్స్లో మెడలే నా లక్ష్యం..
ఒలింపిక్స్లో భారత్కు మెడల్ సాధించడమే నా డ్రీమ్. పారిస్ ఒలింపిక్స్లో పతకం గెలిచేందుకు కృషి చేస్తా.  ఇలోగా ఇతర టోర్నీల్లో రాణించేందుకు ప్రయత్నిస్తా.