శంషాబాద్ ఎయిర్ పోర్టులో కార్తీక్ కు ఘన స్వాగతం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కార్తీక్ కు ఘన స్వాగతం

హైదరాబాద్ కు చేరుకున్న బాక్సింగ్ ఛాంపియన్ కార్తీక్ కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాంలో ఈ నెల 7,8 తేదీల్లో 10వ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్ షిప్ లో 70 కేజీల విభాగంలో కార్తీక్ రెడ్డి బంగారు పతకం సాధించాడు. గురువారం లండన్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కార్తీక్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి ఘన స్వాగతం పలికారు.

కామన్వెల్త్ కరాటే ఛాంపియన్ షిప్లో తెలుగు కుర్రాడు కార్తీక్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్లో జరిగిన పోటీల్లో  కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకాన్ని సాధించాడు.  క్యాడెట్ బాలుర 70 కేజీల విభాగంలో కార్తీక్ రెడ్డి విజేతగా నిలిచి..పసడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలో సైప్రస్కు చెందిన జారాలాంపౌస్ సిల్వర్ దక్కించుకున్నాడు. స్కాట్లాండ్కు చెందిన హారిసన్ లుకాస్ , ఇంగ్లాండ్ కు చెందిన జేకబ్ కట్లర్ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. 

తిరుపతికి చెందిన కార్తీక్ రెడ్డి.. ఏప్రిల్లో జరిగిన యూఎస్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్లోనూ  స్వర్ణం పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్ 12–13 బాయ్స్ కుమిటే టీమ్ విభాగంలో గోల్డ్ ను గెలిచాడు. USA, జపాన్, బోట్స్‌వానా, పనామా, ఇండియా, నేపాల్, ఫ్రాన్స్, వెనిజులా, ఇరాన్‌లతో సహా 40 దేశాల నుండి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా...అద్భుతమైన   ధైర్యసాహసాలతో కార్తీక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్లో భారత్ తరపున గోల్డ్ గెలిచిన మొదటి జూనియర్ అథ్లెట్ గా కార్తీక్ రెడ్డి నిలిచాడు. స్వర్ణం గెలిచిన కార్తీక్ రెడ్డిని ఏపీ కరాటే అసోసియేషన్ సత్కరించింది. కార్తీక్‌తో పాటు షోలాపూర్‌కు చెందిన మరో క్రీడాకారిణి భువనేశ్వరి జాదవ్ కూడా ‘సీనియర్ ఎలైట్’ విభాగంలో ఒక రజతం, రెండు కాంస్యాలతో సహా మూడు పతకాలు గెలుచుకుంది.