ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించినప్పటికీ మార్కెట్లో దొరుకుతూనే ఉంది. చైనా మాంజా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ జరుగుతున్నా కూడా చైనా మాంజా వాడటం ఆపట్లేదు జనం. జగిత్యాల జిల్లాలో చైనా మాంజా వల్ల నాలుగేళ్ళ బాలుడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చేరాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని ఎస్సార్ఎస్సీ క్యాంపు దగ్గర ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహస్ అనే నాలుగేళ్ళ బాలుడికి చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీహస్ కు తీవ్ర గాయాలవడంతో నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. బాలుడి మెడ చుట్టూ 20 కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చైనా మాంజాతో పతంగులు ఎగరవేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాతో ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగరవేసిన వ్యక్తులనే బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేస్తామన్నారు.
చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై నిఘా పెట్టామని వెల్లడించారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా వివరాలను సీపీ సజ్జనార్ గురువారం మీడియాకు వివరించారు. నెల రోజుల వ్యవధిలో మొత్తం 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
