వీడియో గేమ్స్ ఆడుతూ.. రూ.17 లక్షలు సంపాదించాడు

వీడియో గేమ్స్ ఆడుతూ.. రూ.17 లక్షలు సంపాదించాడు

వీడియో గేమ్స్ ఆడుతూ అందరూ ఇంట్లో పేరంట్స్ డబ్బులు పోగొడుతుంటే.. వీడు మాత్రం అవే వీడియో గేమ్స్ ఆడుతూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంట్లో కూర్చుని.. గొడవ చేయకుండా.. బుద్దిగా.,, 24 గంటలూ వీడియో గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తుండటంతో.. పేరంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారంట. డబ్బులు వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారండీ అన్నట్లు.. టైంకు అన్నీ తెచ్చి పెడుతున్నారంట పేరంట్స్.. వీడియో గేమ్స్ లో కొడుకు ప్రతిభ చూసి మురిసిపోతూనే.. లక్షలకు లక్షలు డబ్బులు వచ్చి పడుతుంటంతో.. ఖుషీ ఖుషీ అవుతున్నారు ఆ పేరంట్స్..

ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, 17 ఏళ్ల బాలుడు మాసన్ బ్రిస్టో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. అతను దాన్నుంచి లక్షల రూపాయలు సంపాదించాడు. అతను 2018 సంవత్సరం నుంచి వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. అతనికి వస్తోన్న లాభం చూసి ఇంట్లో వాళ్లు కూడా అతన్ని ఎవరూ ఆపలేదు.

బాలుడు ఇప్పటివరకు 17వేల పౌండ్లకు పైగా అంటే భారతీయ కరెన్సీలో రూ.17 లక్షల 65 వేలకు పైగా సంపాదించాడు. ఈ డబ్బుతో బట్టలు, బూట్లు కొనుక్కోవడానికి, కాలేజీ ఫీజులు కట్టడానికి ఉపయోగించేవాడు. వీడియో గేమ్స్ తో తమకున్న ఇబ్బందులను తీర్చుకోవాలని, అందుకు ఏదో ఒకటి చేయాలని భావించి బాలుడు గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. అతను తన 63 ఏళ్ల తండ్రి అలాన్, 50 ఏళ్ల తల్లి నటాలీ, నలుగురు తోబుట్టువులతో కలిసి బ్రిస్టల్‌లో నివసిస్తున్నాడు.

ఇప్పుడు స్పోర్ట్స్‌ని కెరీర్‌గా మార్చుకోవాలనుకుంటున్నాడు...

మాసన్ తన ఈ అభిరుచిని డబ్బు సంపాదించడానికి ఉపయోగించాలనుకుంటున్నాడు. అతను ఏ పని చేయడు కానీ గేమ్ కరెన్సీని నిజమైన డబ్బుగా మారుస్తాడు. అతను రోజుకు 10 నుంచి 20 గంటలు గేమ్‌లు ఆడటానికి, కొత్త కంటెంట్‌ను రూపొందించడానికి వెచ్చిస్తాడు. ఫీజులు, ట్రిప్పులే కాకుండా మ్యూజికల్ థియేటర్ కోర్సులు చేయడానికి కూడా దాన్ని ఉపయోగించుకుంటాడు. దీంతో తమకెలాంటి ఇబ్బంది లేదని, కొడుకును చూసి గర్వపడుతున్నామని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు.