Raja Singh : రాజమౌళి సినిమాలను బహిష్కరించాలి.. హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే!

 Raja Singh : రాజమౌళి సినిమాలను బహిష్కరించాలి.. హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే!

తన చలనచిత్రాలతో అంతర్జాతీయ స్ఘాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దర్శకధీరుడు ఎస్. ఎస్ . రాజమౌళి చుట్టూ ప్రస్తుతం వివాదాలు చుట్టుముట్టారు.  సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రూపొందిస్తున్న  'వారణాసి' టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయంటూ నెటిజన్లు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లేటెస్ట్ గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం రాజమౌళిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజమౌళి సినిమాలను బహిష్కరించాలి..

దర్శకుడు రాజమౌళి నిజంగా నాస్తికుడు అయితే బహిరంగంగా ప్రకటించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు, రామాయణ, మహాభారతం వంటి పురాణ ఇతివృత్తాలతో సినిమాలు తీసి కోట్లు సంపాదించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాజమౌళి తీసే ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజమౌళి వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తామని హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే?

 గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' గ్లింప్స్ వీడియోను ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..  గ్లింప్స్ వీడియో ప్రదర్శనలో పదే పదే సాంకేతిక ఆటంకాలు ఏర్పడటంతో రాజమౌళి కొంత అసహనానికి లోనయ్యారు. అంతకుముందు, కథా రచయిత, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. రాజమౌళి గుండెలపై అనుక్షణం హనుమాన్ ఉన్నాడు అని వ్యాఖ్యానించారు.

అయితే, సాంకేతిక సమస్యల కారణంగా నిరాశ చెందిన రాజమౌళి మైక్ తీసుకొని, తన వ్యక్తిగత విశ్వాసాలపై ఇలా మాట్లాడారు. నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది.  హనుమంతుడుఉంటే ఇదేనా నడిపించేది...? అని అసహనం వ్యక్తం చేశారు. తన భార్యకు హనుమంతుడంటే ఇష్టమని, ఆమెపై కూడా ఆ క్షణంలో కోపం వచ్చిందని తెలిపారు.

 కేసుల నమోదు..

అయితే  రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల 'రాష్ట్రీయ వానరసేన సంఘం' తో సహా పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో రాజమౌళిపై పోలీసు ఫిర్యాదులు కూడా నమోదు చేశాయి. దీంతో రాజమౌళిపై ఏకంగా మూడు కేసులు నమోదయ్యాయి. ఒకవైపు మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలు, మరోవైపు 'వారణాసి' టైటిల్‌ను తాము రిజిస్టర్ చేసుకున్నామని మరో సినీ బృందం అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజమౌళికి వరుస సమస్యలు చుట్టుముట్టాయి. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత భావజాలం నుండి వచ్చినా..  ప్రజా వేదికపై హిందూ దేవుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద రాజకీయ-, మత వివాదానికి దారి తీశాయి. ఈ వివాదంపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.