షేర్ ఆటోలో ఎక్కించుకుంటరు.. సెల్‌ఫోన్ కొట్టేస్తరు

షేర్ ఆటోలో ఎక్కించుకుంటరు..  సెల్‌ఫోన్ కొట్టేస్తరు
  • ప్యాసింజర్ల మొబైల్స్ దొంగిలిస్తున్న ఐదుగురు అరెస్ట్
  • రూ.6 లక్షల విలువైన 19 సెల్​ఫోన్లు స్వాధీనం

కంటోన్మెంట్, వెలుగు: షేరింగ్ ఆటోలో ఎక్కే ప్యాసింజర్ల సెల్ ఫోన్లను కొట్టేస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ను బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బేగంపేట ఏసీపీ రామలింగరాజు ఈ కేసు వివరాలు వెల్లడించారు. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఏజాజ్ జల్సాలకు బానిసై ఈజీ మనీ కోసం సెల్ ఫోన్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. బహదూర్‌‌ పురాకు చెందిన ఆటో డ్రైవర్లు సయ్యద్ సాజిద్ (35), మహ్మద్ అమీర్ (28), మహ్మద్ ఇలియాస్,  వసీంతో కలిసి ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.  వీరంతా కలిసి సయ్యద్ సాజీద్ కు చెందిన ఆటోలో ప్యాసింజర్లను ఎక్కించుకుని వారి సెల్ ఫోన్లను కొట్టేసేవారు. చోరీలు చేసే సమయంలో ఏజాజ్ ఆటో నడిపేవాడు. మిగతా నలుగురు ప్యాసింజర్ల లాగా ఆటోలో కూర్చునేవారు. ఎవరైనా ప్యాసింజర్ ఆటో ఎక్కగానే వారిని మాటల్లో పెట్టి సెల్ ఫోన్ చోరీ చేసేవారు. ఇలా కొట్టేసిన సెల్ ఫోన్లను ఫలక్ నుమాకు చెందిన పాన్ షాప్ నిర్వాహకుడు మహ్మద్ అహ్మద్(23), ఓల్డ్ సిటీ ఈదీ బజార్ కు చెందిన సెల్ ఫోన్ షాప్ నిర్వాహకుడు మహ్మద్ షఫీ(28)కి అమ్మేవారు.

డైలీ ఐదు సెల్ ఫోన్లు కొట్టేసేందుకు టార్గెట్

ఏజాజ్ గ్యాంగ్ డైలీ ఐదు సెల్ ఫోన్లను కొట్టేసేందుకు టార్గెట్ పెట్టుకునేది. సాయంత్రానికల్లా 5 మొబైల్స్ ను దొంగిలించేవారు. అయితే, ఏజాజ్ నుంచి ఫోన్లను కొన్న అహ్మద్, షఫీ వాటిని నేరుగా కాకుండా ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్మేవారు. ఎర్రగడ్డకు చెందిన దేవేంద్రకుమార్(32) గత నెల 31న ఉదయం 9 గంటలకు న్యూ బోయిన్ పల్లి నుంచి కొంపల్లి వెళ్లేందుకు ఏజాజ్ ఆటో ఎక్కాడు. అప్పటికే అందులో ఏజాజ్ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు ఉండటంతో  దేవేంద్రకుమార్‌‌ను  మధ్యలో కూర్చొమని చెప్పారు. కొంతదూరం వెళ్లాక దేవేంద్ర సెల్ ఫోన్ కనిపించకపోవడంతో పక్కన కూర్చున్న వారిని అడిగాడు. 

వెంటనే ఏజాజ్ ఆటో ఆపగా.. అందరూ అక్కడి నుంచి పారిపోయారు. దేవేంద్ర బోయిన్ పల్లి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. సయ్యద్ సాజిద్, అమీర్, ఇలియాస్ తో పాటు దొంగిలించిన సెల్ ఫోన్లను కొంటున్న అహ్మద్, షఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 లక్షల విలువైన వివిధ కంపెనీలకు చెందిన 19 సెల్ ఫోన్లు, చోరీకి వాడిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఏజాజ్ తో పాటు వసీం పరారీలో ఉన్నారని.. వీరిపై బోయిన్​పల్లితో పాటు సిటీలోని 10 పోలీసు స్టేషన్ల  పరిధిలో  23 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.