
- మల్లన్న సాగర్ లో ఏర్పాటు చేసేందుకు నిరుడే సింగరేణి ప్రపోజల్
- ప్రాథమిక సర్వే పూర్తి చేసిన ఆఫీసర్లు
- ఎన్నికల టైంలో రిస్క్ ఎందుకని పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం
సిద్దిపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించడంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించి సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో 250 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ప్లాంట్ కు ప్రపోజల్స్ పెట్టారు. నిరుడు దీనిపై ప్రాథమిక సర్వే నిర్వహించి ప్లాంట్ ఏర్పాటుకు పర్మిషన్ కోసం ప్రభుత్వానికి రిపోర్టు అందించింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రానట్టు తెలుస్తోంది.
మల్లన్న సాగర్ రిజర్వాయర్ 18 వేల ఎకరాల విస్తీర్ణంలో 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించగా 800 ఎకరాల్లో రెండు దశల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటును సింగరేణి సంస్థ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. రిజర్వాయర్ లో తేలియాడే పలకలను ఏర్పాటు చేసి రెండు దశల్లో ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనే దిశగా ఆఫీసర్లు కసరత్తు చేశారు. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కు అన్ని డిపార్ట్మెంట్లు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే సింగరేణి సంస్థ ప్రభుత్వ అనుమతి కోసం ప్రపోజల్స్ అందించింది.
నిర్వాసితులు వ్యతిరేకిస్తారనే భయంతోనే..
రిజర్వాయర్ లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై నిర్వాసితుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ప్రస్తుతానికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనట్టు తెలుస్తోంది. రిజర్వాయర్ నిర్మాణంతో తొగుట, కొండపాక మండలాల్లోని 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాలకు చెందిన నిర్వాసితులను గజ్వేల్ టౌన్ దగ్గరలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. ఈ కాలనీలో దాదాపు 16 వేల మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో 10 వేల మందికి ఓటు హక్కు ఉండగా వీరంతా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో చేపల వేట హక్కును ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు కొద్ది నెలల కింద కల్పించింది. ఈ నేపథ్యంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశాక నిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎన్నికల టైంలో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతోనే ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టు తెలుస్తోంది.
చేప పిల్లల విడుదలకు సన్నాహాలు
మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేప పిల్లలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో 40, 100 మిల్లీ మీటర్ల సైజులో చేపలను విడుదల చేయనున్నారు. రిజర్వాయర్ లో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో దాదాపు 50 లక్షల చేప పిల్లలను వదలడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన చేపలను పట్టుకోవడానికి నిర్వాసిత గ్రామాల ప్రజలకు ప్రభుత్వం హక్కు కల్పించింది.
పంప్ హౌజ్ కు దగ్గరలో ప్లాంట్
సింగరేణి అధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్లాంట్‌ను పంప్ హౌజ్ కు దగ్గరలో ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతంగా నిర్ణయించి పలుమార్లు ఫీల్డ్ సర్వే చేశారు. మొదటి విడతలో మూడు ఎకరాల్లో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించారు. నేలపై ఒక మెగావాట్ కెపాసిటీ కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఐదెకరాల స్థలం అవసరం అవుతుంది.
రిజర్వాయర్ ఉపరితలంపై తేలియాడే పలకలను ఏర్పాటు చేయడం వల్ల భూసేకరణ అవసరం ఉండకపోవడమే కాకుండా తేలియాడే పలకలను నీటిపై పరచడం వల్ల 70 శాతం నీరు ఆవిరి కాకుండా నివారించవచ్చు. సోలార్ పవర్ ప్రొడక్షన్ కు అనువైన పరిస్థితులు మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో ఉండడంతో ఇక్కడే భారీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సింగరేణి భావిస్తోంది.