అమల్లోకి కోడ్ .. ధరణి స్పెషల్​ డ్రైవ్​కు బ్రేక్

అమల్లోకి కోడ్ ..  ధరణి స్పెషల్​ డ్రైవ్​కు బ్రేక్

హైదరాబాద్​, వెలుగు:  లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ విడుదల కావడంతో రాష్ట్రంలోనూ ఎలక్షన్ కోడ్​ అమల్లోకి వచ్చింది. ఆన్​ గోయింగ్​ స్కీమ్స్​ విషయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి నిబంధనలు వర్తించాయో ఇప్పుడు కూడా అవే వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది. ఆదివారం వరకు కొనసాగాల్సిన ధరణి స్పెషల్​ డ్రైవ్​కు ఎలక్షన్​ కోడ్​తో​ బ్రేక్​ పడింది. అయితే, ధరణి ఇతర వ్యవహారాలన్ని ఎప్పటిలాగే కొనసాగుతాయని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్​ సిలిండర్​, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్​ గృహజ్యోతి గ్యారంటీలు అమల్లో ఉండనున్నాయి. 

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానుందన.. ఈ స్కీంపై ప్రభుత్వం ఎలక్షన్​ కమిషన్​ నుంచి క్లారిటీ తీసుకుని  ముందుకు వెళ్లనున్నది. రైతుబంధు పథకం కింద యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో జమ చేయలేదు. దాదాపు 10 శాత మంది రైతులకు రైతుబంధు ఇవ్వాల్సి ఉన్నట్టు తెలిసింది. గతంలో ఈ స్కీంకు ఈసీ బ్రేక్​ వేసిన నేపథ్యంలో ఇప్పుడు కొనసాగింపు ఉంటుందా? లేదా? అనేదానిపైనా క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వేరే ఏ ఇతర పథకంపైనా  కంప్లయింట్స్​ ఉంటే ఈసీ ఆదేశాలకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సీఈఓ వికాస్​ రాజ్​ జిల్లా కలెక్టర్లతో శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోడ్​ నేపథ్యంలో పలు కీలక సూచనలు చేశారు.  

నిబంధనల ప్రకారం.. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే ఆధారాలు చూపించాల్సి ఉంటుందని,  ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలని సూచించారు. ప్రభుత్వ, పబ్లిక్​ ప్లేసుల్లో సర్కార్​కు సంబంధించిన పథకాల హోర్డింగ్​లు, బ్యానర్లు, ఫొటోలు తొలగించాలని ఆదేశాలు ఇ చ్చారు.  మంత్రులు వారి కాన్వాయ్​ వాహనాలను పార్టీ కార్యక్రమాలకు వాడుకోరాదని స్పష్టం చేశారు.  బంగారం, ఇతర ఆభరణాలు భారీస్థాయిలో తీసుకెళ్లాలంటే తగిన ఆధారాలు, సర్టిఫికెట్లు చూపాల్సిందేనని స్పష్టం చేశారు. అత్యవసర వైద్యం, స్కూల్​, కాలేజీ  ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవస రాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్లే వారు సంబంధిత పత్రాలు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.  

ఏపీ, తెలంగాణలో ఒకేసారి పోలింగ్​

 గత లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణకు మొదటి ఫేజ్​లో ఎన్నికలు​ నిర్వహించారు. ఆ తరువాత ఏపీలో అసెంబ్లీ, లోక్​సభకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే ఫేజ్​(నాలుగో విడత)లో ఒకే తేదీన పోలింగ్​ పెట్టా లని ఈసీ నిర్ణయించింది. కొందరికి ఏపీలో, ఇక్కడ రెండేసి ఓట్లు ఉన్నట్టు పలు కంప్లయింట్లు ఈసీకి అందాయి. ప్రధానంగా ఏపీ బార్డర్​ జిల్లాలతో పాటు హైదరాబాద్​లో ఉన్న ఏపీ సెటిలర్స్​కు చాలా మందికి తెలంగాణతో పాటు ఏపీ​లోనూ ఓట్లు ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయమై గతంలో కొందరు లీడర్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ రెండు తెలుగు రాష్ట్రాలకు ఏక కాలంలో పోలింగ్​ నిర్వహించేలా తేదీలు ప్రకటించినట్టు తెలిసింది.

రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ఓటర్లు

రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 29 లక్షల 95 వేల 735 ఓటర్లు ఉన్నట్టు సీఈఓ వికాస్​ రాజ్​ వెల్లడించారు. ఇందులో పురుష ఓటర్లు కోటి 64  లక్షల 8 వేల 319 మంది ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 65 లక్షల 84 వేల 687 మంది ఉన్నారు. ట్రాన్స్​ జెండర్లు 2,729 మంది ఉన్నట్టు వికాస్​రాజ్​ తెలిపారు. మొత్తం ఓటర్లలో 96.67 శాతం మందికి ఓటరు ఐడీ కార్డులు అందజేసినట్టు ఒక ప్రకటనలో  పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్​ స్టేషన్లు ఉన్నట్టు తెలిపారు. వీటికి మరో 492 అనుబంధ పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. ఒక్క పోలింగ్​ స్టేషన్​లో సుమారుగా 934 మంది ఓటర్లు ఉంటారని పేర్కొన్నారు.