ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • గుట్టలను ఖతం చేస్తున్రు..
  • వనపర్తి జిల్లాలో జోరుగా ఎర్రమట్టి తవ్వకాలు
  • వెంచర్లకు సప్లై  చేస్తూ  సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
  • పర్మిషన్లు లేకుండానే యథేచ్ఛగా మట్టి తరలింపు
  • అడ్డుకోబోయిన గ్రామస్తులను బెదిరిస్తున్న టీఆర్ఎస్​ లీడర్లు
  • పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు

వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లోని గుట్టలను కొందరు అక్రమార్కులు ఖతం చేస్తున్నారు. సంబంధిత శాఖల పర్మిషన్,  గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా ఇష్టారాజ్యంగా ఎర్ర మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. ఒక్కో టిప్పర్ కు రూ. 10, 000 వరకు  వసూలు చేస్తూ  రోజుకూ వందల టిప్పర్ల మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. రోజురోజుకూ రెచ్చిపోతున్న మట్టి మాఫియాపై  ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల పెద్దమందడి మండలం జగత్పల్లి లోని  కొండలయ్య  గట్టులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను  గ్రామస్తులు అడ్డుకోగా.. అధికార పార్టీ లీడర్లు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. 

ఏడాదిగా.. యథేచ్ఛగా..

జగత్ పల్లిలోని  కొండలయ్య గుట్ట నుంచి కొంతమంది టీఆర్ఎస్​లీడర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏడాది కాలంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత నవంబర్​ నుంచి ఎర్రమట్టిని రియల్ ఎస్టేట్  కంపెనీల  వెంచర్లకు తరలిస్తున్నా..  స్థానిక రెవెన్యూ,  మైనింగ్​అధికారులు మామూళ్లు తీసుకుని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని వాపోతున్నారు. గ్రామంలో ఇటీవల జరిగిన పెద్దమ్మ పండుగ పేరున రూ. 3 లక్షలు  గ్రామ పంచాయతీకి ఇచ్చిన రియల్ వ్యాపారులు ఇదే అదునుగా  మరింత రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి సమీపంలోని నాగవరం, శ్రీనివాసపురం, రాజపేట, చిమనగుంటపల్లి, బుద్దారం తదితర గ్రామాల ప్రజలు కూడా మట్టి దందాపై మండిపడుతున్నారు.

పట్టించుకోని అధికారులు

జిల్లాలోని  చాలా గ్రామాల్లో ఇలానే గుట్టలను యథేచ్చగా జేసీబీలు, హిటాచీలతో తవ్వేస్తున్నారు. ఆయా మండలాల తహసీల్దార్లు, మైనింగ్ ఆఫీసర్లు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎర్రమట్టిని తరలించాలంటే పర్యావరణ శాఖ అనుమతితో పాటు ఆయా గ్రామ పంచాయతీల తీర్మానం, మైనింగ్, రెవెన్యూ శాఖల పర్మిషన్​తప్పని సరి  కానీ ఇవేమీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. తహసీల్దార్​కు కంప్లైంట్​చేసినా స్పందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు తహసీల్దార్లు అయితే గుట్టల్లో మట్టి తరలింపు తమకు సంబంధం లేదని మైనింగ్ ఆఫీసర్లే  చూసుకోవాలని అంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా గుట్టల్లో నుంచి మట్టిని తరలించడంపై ఇప్పటికే 30 కి పైగా  కంప్లైంట్లు వచ్చినట్లు మైనింగ్ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అభివృద్ధి పేరుతో అధికార పార్టీ లీడర్లు మాఫియాగా మారి గుట్టల్లోని ఎర్రమట్టిని, చెరువుల్లోని ఒండ్రుమట్టిని తరలిస్తూ  లక్షలు వెనుకేసుకుంటున్నారు. ఈ విషయంపై  ప్రజావాణిలో కంప్లైంట్​చేసినా ఫలితం లేదని పెద్దమందడి మండలం జగత్ పల్లికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. వనపర్తి పట్టణం చుట్టుపక్కల గుట్టలు ఇప్పటికే ఖాళీ అయ్యాయని, ఎవ్వరూ పట్టించుకోక పోతే పూర్తి గా కనుమరుగవుతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విచారణ చేపడుతాం

జగత్ పల్లిలోని  కొండలయ్య  గుట్టపై ఎర్రమట్టిని తవ్వుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా మట్టి తవ్వాలనుకుంటే మైనింగ్ ఆఫీసర్ల పర్మిషన్​తప్పని సరిగా తీసుకోవాలి.  గుట్ట లో ఎర్రమట్టి  తవ్వకాలపై విచారణ  జరిపిస్తాం. మట్టి తవ్వుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. 
– సంధ్య , తహసీల్దార్, పెద్దమందడి

అధికారులు పట్టించుకుంటలేరు

గ్రామంలో గుట్టల నుంచి ఎర్రమట్టిని కొందరు కాంట్రాక్టర్లు, రియల్​వ్యాపారులు టిప్పర్ల ద్వారా  యథేచ్ఛగా తరలిస్తున్నారు.  ఈ విషయమై పెద్దమందడి తహసీల్దార్, జిల్లా మైనింగ్​ఆఫీసర్లకు కంప్లైంట్​చేసినా పట్టించుకుంటలేరు. మట్టి దందాను కట్టడి చేయాలి. 
– పెంటయ్య, రైతు, జగత్పల్లి

న్యూడ్ కాల్స్ వ్యవహారంపై సీఎం స్పందించాలి

గద్వాల, వెలుగు:  జిల్లాలో చోటుచేసుకున్న న్యూడ్ కాల్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్, హోంమంత్రి,  డీజీపీ స్పందించాలని  సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో  టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారని, వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోకల్ పోలీసుల ఎంక్వైరీ పై అనుమానాలున్నాయని  సిట్​ఆధ్వర్యంలో దర్యాప్తు చేయించాలన్నారు. ఈ వ్యవహారంలో ఎవరూ కంప్లైంట్ చేయడం లేదన్న సాకుతో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.  కర్రెప్ప, గోపాలరావు, నర్సింలు పాల్గొన్నారు.

దళితుల అభివృద్ధి బీజేపీ ధ్యేయం

ఊట్కూర్, వెలుగు:  దళిత, గిరిజనుల అభివృద్ధి బీజేపీ ధ్యేయమని నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర  కార్యదర్శి ఎం. విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ‘బస్తీ సంపర్క్​అభియాన్’ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్​ విగ్రహం ఎదుట ‘అందరి అభివృద్ధి– అందరి గౌరవం’ పాంప్లెంట్​విడుదల చేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో దళిత, గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు  ప్రవేశపెట్టిందని తెలిపారు. నేటి  నుంచి దళిత, గిరిజన వాడలో కరపత్రిక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి కృషి చేయలేదన్నారు.  ఈ కార్యక్రమంలో దళిత  మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, ఎంపీటీసీ  మెంబర్​డి.హనుమంతు, జిల్లా కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.  

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్​ఫంక్షన్ హాల్​లో మిషన్ భగీరథ కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఏ, డీఏలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్రానికే మిషన్ భగీరథ తలమానికం అని చెప్పుకొని ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా పనిచేయించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కంపెనీ యాజమాన్యానికి తొత్తుగా మారిందన్నారు. ఈనెల 15 లోపు సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్,  సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఈశ్వర్, రామయ్య, శివశంకర్, రాము, బలరాం పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు  అమలు చేయాలని సీఐటీయూ రాష్ర్ట నాయకుడు కిల్లె గోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 3వ మహాసభ జిల్లా  ఆఫీస్​లో జరిగింది. హాజరైన ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, దళితబంధు, మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూం 
ఇండ్లు ఇవ్వాలన్నారు.  సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎర్ర నర్సిములు, నాయకులు ఆకుల వెంకటేశ్, శ్రీనివాసులు, యాదమ్మ, బాలరాజు, విశ్వనాథం, సీఐటీయూ నాయకులు చంద్రకాంత్ తదితరులు 
పాల్గొన్నారు.  

  • బెస్ట్​ టూరిస్ట్​ కేంద్రంగా తెలంగాణ
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్​నగర్​, వెలుగు : పర్యాటకుల భూతల స్వర్గంగా తెలంగాణ మారనుందని  పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లండన్​లో జరుగుతున్న వరల్డ్ టూరిజం మార్ట్ (డబ్ల్యూటీఎం)లోని తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్​లో మంగళవారం   జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఈ మీటింగ్​లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని ఆయన మీడియాకు ఫోన్​ చేసి తెలిపారు.తెలంగాణలో  సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు, పోచంపల్లి ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యేందుకు ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. చక్కని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తిని చూపిస్తున్నారని, అలాంటి  వారిని ఆకట్టుకోవడం ఖాయమన్నారు. డబ్ల్యూటీఎంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలపై సమగ్ర సమాచారాన్ని పర్యాటక సామగ్రి ద్వారా ఫ్రీగా అందిస్తున్నట్లు చెప్పారు. రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీ టూంబ్స్, బుద్ధవనం, యాదాద్రి టెంపుల్, మన్యంకొండ, వేయి స్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మ, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, కాళేశ్వరం ప్రాజెక్ట్, చారిత్రక వరంగల్ కోట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను డబ్ల్యూటీఎం వేదికగా ప్రదర్శిస్తున్నామని తెలిపారు.  తెలంగాణ చరిత్ర, బతుకమ్మ, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్ట్​లో ప్రచారం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మంగళవారం లండన్ వీధుల్లో తెలంగాణ పర్యాటక బృందం రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పర్యాటకాభివృద్ధి శాఖ ఎండీ మనోహర్, పర్యాట శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేశ్,  అసోసియేషన్ ఆఫ్  బ్రిటీష్​ట్రావెల్ ఏజెంట్స్ డైరెక్టర్ సుషాన్ ధీర్ పాల్గొన్నారు.

విజన్​ ఉన్న లీడర్ రేవంత్​రెడ్డి

వనపర్తి , వెలుగు: తెలంగాణ  యువతకు ఉపాధి మార్గాలు అన్వేషించే విజన్ ఉన్న లీడర్ రేవంత్ రెడ్డి అని వనపర్తి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్ రెడ్డి  బర్త్​డే సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, రేవంత్ రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీని అధికారంలోకి  తీసుకురాగలిగే దమ్మున్న నాయకుడు  రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందున్నారు.  రేవంత్ రెడ్డి మిత్రమండలి నాయకుడు వంశీధర్ రెడ్డి, కౌన్సిలర్ బ్రహ్మం చారి పాల్గొన్నారు.

ఎస్పీ బిల్డింగ్​ నిర్మాణ పనులను పూర్తి చేయండి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎస్పీ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎస్పీ మనోహర్  కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గరలో నిర్మిస్తున్న బిల్డింగ్​ను ఎమ్మెల్యే  జనార్దన్ రెడ్డి తో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆఫీస్​నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు నత్త నడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ మోహన్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ రాజు 
పాల్గొన్నారు. 

గురునానక్ ​బోధనలు ఆచరణీయం

ఆమనగల్లు, వెలుగు: అన్ని మతాలను సమానంగా  చూడాలని బోధించి  విశ్వమానవాళిని ఏకతాటిపై నడిపించేందుకు కృషి చేసిన గొప్ప గురువు గురునానక్ అని జిల్లా కాంగ్రెస్  లీడర్లు కొనియాడారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో గురునానక్ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు  పూలమాల వేసి  నివాళి అర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురునానక్ బోధనలు ఆచరణీయమని చెప్పారు.  డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిక్యా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ, రేవంత్ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ అలీ పాల్గొన్నారు. 

పాలమూరులో బుద్ద ధర్మ దీపాల పండగ

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో బుద్ద ధర్మ దీపాల పండగ కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఎ.నటరాజ్, బుద్దిస్ట్ సొసైటీ మెంబర్​ఆది లక్ష్మయ్య, డాక్టర్ నాగయ్య హాజరై మాట్లాడారు.  చీకటి నుంచి వెలుగులోకి వెళ్లి జ్ఞానం పొందాలని, కుల, మత వర్గాల మధ్య కక్షలు లేకుండా సమాజంలో అందరు సమానంగా జీవించాలని గౌతమ బుద్ధుడు బోధించారన్నారు.  అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షుడు రాయికంటి రాందాస్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్, ఎల్. రమేశ్, మల్లెల రాజశేఖర్, రాజగాని అశోక్, పాతూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.