ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి

పర్వతగిరి, వెలుగు: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్​ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్, మాజీ జడ్పీటీసీ రాములు తదితరులున్నారు. అనంతరం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3న నిర్వహించే ‘మెగా జాబ్ మేళా’ వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మామునూర్ 4వ బెటాలియన్ పక్కన ఉన్న హెచ్ఆర్ఎస్ గార్డెన్స్ లో ఈ మేళా ఉంటుందని, నిరుద్యోగులు ఈ చాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మెరుగైన సేవలు అందించాలి

వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే అరూరి రమేశ్​ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులపై డాక్టర్లతో చర్చించారు. రోగులకు నమ్మకంగా సేవ చేసి, మెరుగైన వైద్యం అందించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న మార్చురీ బిల్డింగ్​ను కూల్చి, కొత్త బిల్డింగ్ కట్టాలన్నారు. ఈ సీహెచ్ సీని 100 బెడ్లకు అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్, వార్డు కౌన్సిలర్లు, డాక్టర్లు ఉన్నారు.

నర్సంపేట హాస్పిటల్ కు మరో రూ.10 కోట్లు

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్మాణం అవుతున్న 250 బెడ్ల హాస్పిటల్​కు మరో రూ.10కోట్లు రిలీజ్ అయ్యాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు సర్కారు నుంచి రూ.58కోట్లు రిలీజ్ కాగా, పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. మరో ఆరు నెలల్లో వర్క్స్ కంప్లీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మతోన్మాదుల ఆటలు సాగవు: కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్​

హనుమకొండ, వెలుగు: తెలంగాణ ప్రజలు విచ్ఛిన్నకారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ మతోన్మాదుల ఆటలు సాగబోవని కవి, గాయకుడు , సీఎంవో ఓఎస్​డీ దేశపతి శ్రీనివాస్​అన్నారు. మంగళవారం కేసీఆర్​దీక్షా దివస్​ సందర్భంగా నక్కలగుట్టలోని కాళోజీ సెంటర్ వద్ద చీఫ్ విప్  దాస్యం వినయ్​ భాస్కర్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.  కేసీఆర్ ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమానికి ఊతమిచ్చిందని, తెలంగాణ పోరాటంలోనే కేసీఆర్ దీక్ష ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఓరుగల్లు కేంద్రంగా సీమాంధ్రుల కుట్రలకు వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యేగా పోరాడిన ఘనత దాస్యం వినయ్ భాస్కర్ కే  దక్కుతుందన్నారు. చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ స్ఫూర్తితోనే  తెలంగాణ ఉద్యమంలో తాను తెగించి పోరాడానన్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రొఫెసర్ పాపారావు మాట్లాడుతూ తాను ఆంధ్రా ప్రాంతం వాడినైనా తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు తెలిపానన్నారు. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడం గొప్ప విషయమన్నారు. మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మర్రి యాదవ రెడ్డి  ఉన్నారు.

దీక్షా దివస్ చరిత్రలో నిలిచిపోయే రోజు

జనగామ అర్బన్: 2009 నవంబర్​ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో నిలిచిపోయే రోజని జడ్సీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్​రెడ్డి అన్నారు. మంగళవారం దీక్షా దివస్​ ను పురస్కరించుకుని టౌన్​లో సీఎం కేసీఆర్​ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

‘కేసులు పెట్టి తొక్కిస్తా..’: విలేకరిని బెదిరించిన టీఆర్ఎస్ లీడర్

ఆత్మకూరు, వెలుగు: ‘పెద్దపెద్దోళ్లనే తొక్కినం.. నువ్వెంత? కేసులు పెట్టి తొక్కిస్తా. గల్లాపట్టి రోడ్డుపై కొడతా.’ అంటూ ఆత్మకూరు ఇన్ చార్జి సర్పంచ్ భర్త, టీఆర్ఎస్ లీడర్ భగవాన్ రెడ్డి ఓ విలేకరిని బెదిరించాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆయన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇంటి పర్మిషన్ కోసం భగవాన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడని ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న సంభాషణను సదరు విలేకరి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా.. ఆ విలేకరికి ఫోన్ చేసి పైవిధంగా బెదిరించాడు. మర్యాదగా ఉంటే మంచిది లేదంటే కేసులు పెట్టిస్తానని బూతు పురాణం 
అందుకున్నాడు.

పాదయాత్రపై టీఆర్ఎస్ కుట్ర

ధర్మసాగర్, జనగామ అర్బన్, వెలుగు: వైయస్ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ కుట్ర పన్నిందని, ఆ పార్టీ లీడర్లు గూండాల్లా పెట్రోల్ దాడులకు పాల్పడుతున్నారని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ లీడర్లు ధర్నాలు చేశారు. ధర్మసాగర్ లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జనగామ చౌరస్తాలో సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడులు చేస్తున్న టీఆర్ఎస్ గూండాలను వదిలిపెట్టి.. ప్రజల పక్షాన పోరాడుతున్న షర్మిలను అరెస్ట్ చేయడం తగదన్నారు. పోలీసులు సర్కారుకు తొత్తులా మారారని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ధర్మసాగర్ మండలాధ్యక్షుడు టేకుమట్ల విష్ణు, జనగామ జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్య ఉన్నారు.

ప్రజల మధ్య పెద్ది చిచ్చు..

నర్సంపేట, వెలుగు: ప్రశాంతంగా ఉన్న నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిచ్చు పెడుతున్నాడని, రాళ్లు, పెట్రోల్ దాడులతో హింసకు ప్రేరేపిస్తున్నారని బీజేపీ లీడర్, నెక్కొండ మాజీ ఎంపీపీ గటికె అజయ్ కుమార్ ఆరోపించారు. షర్మిల దాడిని ఒక వ్యక్తిగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించే వారిపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు.

బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కాజీపేట, వెలుగు: రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కార్యకర్తలకు సూచించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం హనుమకొండ సుబేదారిలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరగగా.. డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మీటింగ్ లో బీజేపీ జిల్లా ఇన్​చార్జి డా.మురళీధర్ గౌడ్, మాజీ మేయర్ డా. టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్ తదితరులున్నారు.

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. గ్రామాల్లో మూఢ నమ్మకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మంగళవారం ములుగు కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్​ మానిటరింగ్  మీటింగ్​ నిర్వహించారు. ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తో కలిసి కేసులపై ఆరా తీశారు. నేరాలకు పాల్పడిన వారు, తప్పించుకోకుండా శిక్షపడేలా చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ కేసులు 70, ఇన్వెస్టిగేషన్ లో 14 కేసులు ఉన్నాయన్నారు. అన్ని కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖతో కలిసి గుడుంబా నియంత్రణకు పోలీసులు కృషి చేయాలన్నారు. గుడుంబా వ్యాపారులను బైండోవర్ చేసి, పునరావాసం కల్పించాలన్నారు. దళిత దివ్యాంగులకు దళిత బంధు పథకంలో ప్రాధాన్యత కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి తదితరులున్నారు.