
జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా టీ20 లీగ్ (ఎస్‌ఏ 20) నాలుగో సీజన్ ప్లేయర్ల వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సఫారీ యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్, ఆ దేశ టీ20 కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ రికార్డు స్థాయి ధర పలికి లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు. సౌరవ్ గంగూలీ కోచ్‌గా వ్యవహరిస్తున్న ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 22 ఏండ్ల బ్రెవిస్‌ను సుమారు రూ. 8.3 కోట్లు (16.5 మిలియన్ల సౌతాఫ్రికా రాండ్స్ ) వెచ్చించి సొంతం చేసుకుంది. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌తో తీవ్ర పోటీలో బ్రెవిస్‌ను దక్కించుకుంది. దాంతో 2022లో ట్రిస్టన్ స్టబ్స్‌కు లభించిన రూ. 4.6 కోట్ల (9.2 మిలియన్లు) అత్యధిక ధర రికార్డును బ్రెవిస్ బ్రేక్ చేశాడు. మరోవైపు, సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ డర్బన్స్ సూపర్ జెయింట్స్ రూ. 7 కోట్ల (14 మిలియన్లు)కు కొనుగోలు చేసింది.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించి 12.4 మిలియన్లకు అతడిని రిటైన్ చేసుకోవడానికి ప్రయత్నించినా డర్బన్ ఫ్రాంచైజీ వెనక్కు తగ్గలేదు. ఓవరాల్‌గా ఆరు ఫ్రాంచైజీలు 84 మంది ఆటగాళ్ల కోసం 129.3 మిలియన్లు (సుమారు రూ. 65 కోట్లు) ఖర్చు చేశాయి. ఇందులో సఫారీ ఆటగాళ్ల కోసమే సుమారు రూ. 59 కోట్లు (116.9 మిలియన్లు) వెచ్చించడం గమనార్హం. ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌ను జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ రూ. 4.5 కోట్లకు దక్కించుకుంది. పేసర్ నాండ్రీ బర్గర్ రూ. 3.1 కోట్లకు అదే జట్టులో చేరాడు. కాగా, ఎస్‌ఏ 20 లీగ్ నాలుగో సీజన్ డిసెంబర్ 26 నుంచి జనవరి 25 వరకు జరగనుంది.