చికెన్ విషయంలో గొడవ.. నవ వధువు ఆత్మహత్య

చికెన్ విషయంలో గొడవ.. నవ వధువు ఆత్మహత్య

కోరుట్ల, వెలుగు: చికెన్  భోజనం విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగి మనస్తాపంతో నవ వధువు   ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన వారం రోజుల్లోనే ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన  ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు అలియాస్  అల్లెపు గంగోత్రి(22), అదే గ్రామానికి చెందిన అల్లెపు సంతోష్  ఆరేండ్లుగా ప్రేమించుకున్నారు. 

ఇరు కుటుంబాల అంగీకారంతో గత నెల 26న పెండ్లి చేసుకున్నారు. కాగా, గురువారం దసరా రోజు భర్తతో కలిసి గంగోత్రి పుట్టింటికి వెళ్లింది. అదే రోజు కుటుంబ సభ్యులతో కలిసి గంగోత్రి చికెన్  తింటుండగా, భర్త సంతోష్  ప్రశ్నించాడు. ఇంటికి మటన్  తీసుకువస్తే ఎప్పుడూ తినని నువ్వు ఇప్పుడూ ఎలా తింటున్నావని అడిగాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగింది. అదే రోజు భర్తతో కలిసి  అత్తారింటికి వెళ్లింది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని చనిపోయింది. సంతోష్​ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెట్​పల్లి సీఐ అనిల్, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్  తెలిపారు.