అద్దె భారం వేల కోట్లు! . ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏండ్లలో రూ.7,800 కోట్ల ఖర్చు

అద్దె భారం వేల కోట్లు! . ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏండ్లలో రూ.7,800 కోట్ల ఖర్చు
  • హైదరాబాద్​లో హెచ్ఓడీలు, కమిషనరేట్ ఆఫీస్​లు అద్దె భవనాల్లోనే
  • కొత్త జిల్లాలు, మండలాల్లోనూ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్స్​లోనే
  • ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె భారం రూ. 540  కోట్లు 
  • వీలైనంత వరకు సొంత బిల్డింగులకు తరలింపు 
  • కుదరని చోట్ల కొత్త బిల్డింగుల నిర్మాణానికి సర్కారు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసుల అద్దెల కోసమే గడిచిన పన్నెండేళ్లలో దాదాపు రూ.7,800 కోట్లు ఖర్చు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు చేరువగా పాలన అందించాలనే లక్ష్యంతో మార్పులు జరుగుతున్నా.. కార్యాలయాలకు మాత్రం సొంత గూడు కల్పించడంలో ఆశించిన పురోగతి లేకపోవడంతో ఈ భారీ వ్యయం అయినట్లు అధికారులు తేల్చారు. ప్రతి సంవత్సరం యావరేజ్ గా రూ.650 కోట్లు ఖర్చు చేశారు. ఏటా పెరుగుతున్న అద్దెలతో పాటు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే ఖజానాపై పడుతున్న భారం వేల కోట్లలో ఉంటున్నది. ఇంత భారీ మొత్తాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తున్నా, శాశ్వత భవనాల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ఈ నష్టం జరిగినట్లు ఇటీవల ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదించారు. ఈ అంశాన్ని సీరియస్​గా తీసుకున్న సీఎం వచ్చే నెలలో ప్రభుత్వ ఆఫీసులు ఏవీ కూడా అద్దె భవనాల్లో ఉండరాదని, వాటిని అందుబాటులో ఉన్న సర్కార్ భవనాలకు షిప్ట్​ చేయాలని ఆదేశించారు. ఏపీ పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిన తరువాత కూడా ప్రభుత్వ భవనాలను సరిగ్గా వినియోగించకోకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.వెంటనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్​లు.. 
నో సర్కార్ ఆఫీస్​లు 

ప్రతిష్టాత్మకం అంటూ దాదాపు రూ. 1,500 కోట్లు వెచ్చించి  కొత్త సచివాలయాన్ని నిర్మించిన గత ప్రభుత్వం, అదే సమయంలో కమిషనరేట్లు, డైరెక్టరేట్లకు మాత్రం మొండిచేయి చూపించింది. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌‌ మహానగరంలోనే అనేక కీలక శాఖల అధిపతుల (హెచ్‌‌ఓడీ) కార్యాలయాలు, వివిధ కమిషనరేట్లు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. వాస్తవానికి శాఖాధిపతుల కార్యాలయాలన్నీ ఒకే చోట లేదా ప్రభుత్వ భవనాల్లో ఉంటే సమన్వయం సులువుగా ఉంటుందని తెలిసినా, ఆ దిశగా అడుగులు పడలేదు. మైనింగ్, సెర్ప్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వంటి ఆఫీస్​లు ఇప్పటికీ రెంటెడ్ బిల్డింగ్స్​లోనే కొనసాగుతున్నాయి. మాసాబ్‌‌ ట్యాంక్, బషీర్‌‌బాగ్, అమీర్​పేట వంటి ఇతర ఖరీదైన ప్రాంతాల్లోని ప్రైవేటు కాంప్లెక్స్‌‌లలో ఈ ఆఫీసులను నిర్వహిస్తుండటంతో, చదరపు అడుగుకు భారీ మొత్తంలో అద్దెలు చెల్లించాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి ఒకే చోట అద్దెకు ఉంటున్నా, ఆ మొత్తంతో సొంత భవనాన్ని నిర్మించుకోవచ్చన్న కనీస ఆలోచన కూడా చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల దర్జా కోసం నియోజకవర్గానికి ఒక క్యాంప్ ఆఫీసును అత్యంత శ్రద్ధగా కట్టించిన పాలకులు, ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఆఫీసులను మాత్రం గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకు అన్ని హంగులతో భవనాలు సిద్ధం చేసినా, వివిధ శాఖల అధికారులకు మాత్రం సొంత కుర్చీ వేసుకోవడానికి కూడా ప్రభుత్వ స్థలం లేక ప్రైవేటు షట్టర్లలో ఆఫీసులు నడపాల్సిన దుస్థితి నెలకొంది. కేవలం హైదరాబాద్‌‌లోనే కాకుండా జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పాటైన కొత్త జిల్లాలు, మండలాల్లోనూ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పరిపాలన సౌలభ్యం కోసం అంటూ కొత్త జిల్లాలను, మండలాలను సృష్టించినా.. అక్కడ విధులు నిర్వర్తించాల్సిన కార్యాలయాలకు మాత్రం శాశ్వత భవనాలను సమకూర్చలేదు. దీంతో చాలా చోట్ల తహసీల్దార్ ఆఫీసులు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు ఇరుకు గదుల్లోనో, రేకుల షెడ్లలోనో లేదా అద్దె ఇళ్లలోనో కొనసాగుతున్నాయి.

అన్ని ప్రభుత్వ భవనాలు సద్వినియోగం చేసుకునేలాప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల అద్దెల భారం ఏటా దాదాపు రూ.540 కోట్లుగా ఉందని తేల్చింది. అదీ కూడా కొత్త సమీకృత కలెక్టరేట్లు రావడం, ఏపీ వదిలి వెళ్లిన బిల్డింగ్స్లోకి కొన్ని కమిషనరేట్లు షిఫ్ట్ కావడంతో గత రెండేండ్లలో కాస్త రెంట్ బిల్డింగ్స్​ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మిగిలిన రెంటెండ్​ బిల్డింగ్స్​ను కూడా మార్చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుందని, ఆ మొత్తంతో ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు వినియోగించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయో, వాటన్నింటినీ వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని పక్షంలో, స్థలాలను గుర్తించి సొంతంగా కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సర్కారు భావిస్తున్నది. తద్వారా ఏటా వృథా అవుతున్న వందల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయడంతో పాటు, ప్రభుత్వ ఆఫీసులకు శాశ్వత చిరునామా కల్పించాలని నిర్ణయించింది.