భార్యకు మందుల కోసం వెళ్లాడు.. రైలు ఢీకొని నవ వరుడు మృతి

భార్యకు మందుల కోసం వెళ్లాడు.. రైలు ఢీకొని నవ వరుడు మృతి

కామారెడ్డిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్‌గా గుర్తించారు. కిశోర్‌(25)కు రెండు రోజుల క్రితం వివాహం అయింది. భార్యకు అనారోగ్య సమస్య తలెత్తడంతో మందుల కోసం బయటకొచ్చాడు. ఏదో ధ్యాసలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో.. కాచిగూడ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న డెమో ప్యాసింజర్‌ వేగంగా ఢీ కొట్టింది.  ఈ ఘటనతో పెళ్లింట విషాదం అలుముకుంది. కాళ్ల పారాణి ఆరక ముందే వధువును శోకసంద్రంలోకి నెట్టింది. కుమారుని మృతదేహం వద్ద తల్లిదండ్రులు పద్మ-రాములు రోదిస్తుంటే అక్కడున్నవారి కళ్లు వర్షించాయి. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.