కరీంనగర్ సంక్షిప్త వార్తలు

కరీంనగర్ సంక్షిప్త వార్తలు

సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురుమామిడి, మానకొండూర్ మండలాలలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వరద ఉధృతికి పంటలు నీట మునిగాయి. రోడ్ల పైనుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్​లో 64, చిగురుమామిడిలో 64,8, మానకొండూర్​లో 22,6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. సైదాపూర్​, చిగురుమామిడి మండలాల్లో చెరువులు, కుంటలు నీటితో నిండి పొంగి పొర్లుతున్నాయి. వరద కొంచెంకొంచెంగా పెరగడంతో బుధవారం మధ్యాహ్నం వరకు నీటి ఉధృతి తీవ్రంగా మారింది. 

మోడల్ స్కూల్ చుట్టూ నీరు..
భారీ వర్షాల ధాటికి సైదాపూర్ మండలం సోమారంలోని మోడల్ స్కూల్ చుట్టూ నీరు చేరింది. దీంతో టీచర్లు స్టూడెంట్లను బయటకు తీసుకువచ్చారు. అలాగే సైదాపూర్ నుంచి సోమారం వెళ్లే దారిలో నాలుగు బాటల కూడలిలో రోడ్డు పైనుంచి నీరు ప్రవహిస్తోంది. సోమారం నుంచి మొలంగూర్ వెళ్లే రహదారిలో సమీప సోమేశ్వర కుంట నుంచి వచ్చిన వరద నీరు లోయర్ బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. సోమారం–బూడిదపల్లి, ఎక్లాస్​పూర్–సోమారం గ్రామాల్లో లోబ్రిడ్జిలు నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్–హుజూరాబాద్ రహదారిలో రాకపోకలు బందయ్యాయి. అలాగే చిగురుమామిడి మండలం మోయతుమ్మెద వాగు పొంగి కోహెడ–ఇందుర్తి దారిలో బ్రిడ్జి పై నుంచి వరద వచ్చింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. తోటపెల్లి లెప్ట్ కెనాల్ రేకొండ సమీ పంలోని బండారిపల్లి వద్ద తెగి చిగురుమామిడి,సైదాపూర్ మండలాలలో పంటలు నీట మునిగాయి. అలాగే కరీంనగర్ లో తెల్లవారుజామున వీచిన బలమైన గాలి,వానకు భగత్ నగర్ లో చెట్టు కూలి కరెంట్ పోల్ మీద పడింది. 

విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ 
వీర్నపల్లి : స్టూడెంట్ల చదువు, భోజనం విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం వీర్నపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో తిరుగుతూ డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ గదులను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు తెలుసుకున్నారు. వంటగదిని శుభ్రం చేస్తూ తాజా కూరగాయలను మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని నిర్వాహకులకు సూచించారు. కొన్ని రోజులుగా స్టూడెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. ఆయన వెంట డీఈఓ రాధాకిషన్, ఎంపీపీ మలోత్ బూల, ఎంపీడీవో భారతి, సర్పంచ్ దినకర్, ఉప సర్పంచ్ రవి తదితరులు ఉన్నారు.

సమస్యల్లేని నగరంగా తీర్చిదిద్దుతాం నగర మేయర్ సునీల్ రావు
కరీంనగర్ కార్పొరేషన్ :
కరీంనగర్ ను సమస్యలు లేని సిటీగా తీర్చిదిద్దుకుందామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. బుధవారం స్థానిక 9వ డివిజన్ అలకాపురి కాలనీలో రూ.30లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను కమిషనర్ ఇస్లావత్ తో కలిసి మేయర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్ట్రాం వాటర్ డ్రైనేజీని వేగంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీటితో నిండిన ఖాళీ స్థలాలను పరిశీలించి, వెంటనే నీటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం  ప్రజల సమస్యల్ని తెలుసుకుని వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఐలేందర్, డీఈ ఓంప్రకాశ్​పాల్గొన్నారు.

సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఆధీనంలో కొండగట్టు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం నేటి నుంచి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ఆధీనంలోకి రానుంది. హైదరాబాద్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కు కొండగట్టు, మల్యాల, దొంగలమర్రి ప్రాంతాలను అనుసంధానం చేసినట్లు మాల్యాల సీఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. కలెక్టర్ గుగులోత్ రవి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయడంతో కొండగట్టు టెంపుల్ తోపాటు, చుట్టుపక్కల 60 సీసీ కెమెరాలను ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి నిమిషం సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
బీజేపీ,టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్


కరీంనగర్ టౌన్ : బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికరి ఒప్పందం ప్రకారమే ముందుకెళ్తున్నారని, ఢిల్లీలో దోస్తానా కొనసాగిస్తూ, రాష్ట్రంలో కుస్తీ పడుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం స్థానిక డీసీసీ ఆఫీస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీతో దోస్తానా లేకుంటే ఇన్ని రోజులు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నిబద్ధత, నైతికతపై మాట్లాడే ఈటల రాజేందర్ ఫిరాయింపుల కమిటీకి అధ్యక్షుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. మునుగోడు సీటు కాంగ్రెస్ దేనని, కాంగ్రెస్ విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో మేడిపల్లి సత్యం, నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు. 

హాస్టల్స్​లో వసతులు కల్పించాలి
సిరిసిల్ల  కలెక్టరేట్ : జిల్లాలలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో పారిశుధ్య నిర్వహణతోపాటు విద్యార్థులకు సౌలతులు కల్పించడంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో ఆయన హాస్టల్స్​ సంక్షేమంపై ఆఫీసర్లతో రివ్వూ నిర్వహించారు. ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి రిపోర్ట్ అందించినా నిర్వహణ బాధ్యత వసతి గృహ సంక్షేమ అధికారులదేనని కలెక్టర్ అన్నారు. హాస్టల్‌‌ వంట గది, స్టోర్‌‌ రూంలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ సహకారం లేకుంటే తనకు నివేదించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని గురుకులాలు, హాస్టళ్లలోనే స్టాఫ్ నివాసం ఉండాలన్నారు. స్టాఫ్ వందశాతం హాజరు ఉండాలని, ఆదేశాలు బేఖాతరు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిధులు ఉంటే వెంటనే పనులు చేపట్టాలని, లేకపోతే తనకు వచ్చే సోమవారం వరకు ప్రపోజల్ సమర్పించి రెండు వారాల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సంక్షేమ అధికారులను ఆదేశించారు. సమావేశం లో జిల్లా అడిషనల్​కలెక్టర్ బి.సత్య ప్రసాద్, డీఈఓ రాధా కిషన్, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

ఈటల.. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? - ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి 
హుజూరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పమని అడిగితే సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేస్తున్నారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొని రమ్మని సవాల్ విసిరినా ఈటల రాజేందర్ స్పందించకపోవడం తన తప్పును అంగీకరించినట్లేనని అన్నారు. కాగా ఈటల.. హుజూరాబాద్​అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. అంటూ కౌశిక్​ రెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జెడ్పీ చైర్ పర్సన్ విజయ, మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, జడ్పీటీసీ సభ్యుడు బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోన్ యాప్ లపై అప్రమత్తంగా ఉండాలి కరీంనగర్ సీపీ సత్యనారాయణ
కరీంనగర్ క్రైం, వెలుగు: ఆన్​లైన్ లోన్ యాప్ లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. ఆన్​లైన్ లోన్ యాప్ ల మోసాలపై అవగాహన కల్పిస్తూ కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు నిర్వహిస్తున్న ఇన్విటేషనల్ క్రికెట్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిందితులు దేశ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో మకాం వేసి మోసాలకు పాల్పడి ఇతర దేశాలకు తప్పించుకుని పారిపోతున్నారని చెప్పారు. ఆన్​లైన్ యాప్ ల పై కమిషనరేట్ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని  చెప్పారు. మోసాలకు గురైన ప్రజలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.   కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, ఏసీపీలు శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, ప్రతాప్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, ఎస్​ఐ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

దళితులపై దాడులను ఖండించాలి దళిత నాయకుల డిమాండ్
తిమ్మాపూర్, వెలుగు : ఇటీవల దళితులపై జరుగుతున్న దాడులను ఖండించాలని మండలంలోని దళిత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం తిమ్మాపూర్​లో సర్పంచులు బోయిని కొమురయ్య, మేడి అంజయ్య మాట్లాడుతూ జూలై 31 న మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామ సర్పంచ్ పై అదే గ్రామానికి చెందిన కొందరు అగ్ర కులస్తులు దాడి చేసినప్పటికీ వాళ్లను ఇప్పటికీ అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ మీసాల అంజయ్యపై దాడి చేసిన కొమ్మెర కృష్ణారెడ్డితోపాటు దాడికి పాల్పడిన వారందరిని అరెస్టు చేయాలన్నారు.సమావేశంలో సర్పంచులు వినోద, శంకర్, ఉమారాణి, ఎంపీటీసీ పద్మ పాల్గొన్నారు.

సార్లు ట్రెయినింగ్​లో.. పిల్లలు క్లాస్​ రూంలో..
పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ట్రెయినింగ్​కు వెళ్లడంతో అన్ని క్లాసుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వడ్డెర కాలనీ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో జరిగింది. ప్రభుత్వ ఆదేశాలతో స్కూల్​టీచర్లు బుధవారం ట్రైనింగ్ కోసం వెళ్లారు. పాఠాలు చెప్పేవాళ్లు ఎవరూ లేకపోవడంతో 1 నుంచి 5వ క్లాస్ వరకు ఉన్న మొత్తం 35 మంది స్టూడెంట్స్ ఒక తరగతి గదిలో కూర్చున్నారు. అనంతరం సమాచారం తెలుసుకున్న జెడ్పీహెచ్ఎస్ పీఈటీ మధ్యాహ్నం వేళ స్కూల్​కు వెళ్లారు. కాగా టీచర్స్ తరుచూ ఇలాగే చేస్తున్నారని తల్లిదండ్రులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ‌‌‌‌ -వెలుగు, మల్లాపూర్

‘న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి’
జగిత్యాల : ఇటీవల జరిగిన న్యాయవాదుల హత్యను సర్కార్ సీరియస్ గా తీసుకుని న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ ప్రవీణ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణహరి, జిల్లా అధికార ప్రతినిధులు రమణ, సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జగిత్యాల లో వారు మాట్లారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి జంట హత్యలు మరవకముందే హనుమకొండ లో మల్లారెడ్డి అనే న్యాయవాది హత్య జరగడం బాధాకరమన్నారు. సంఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో  న్యాయవాదులు రాజేందర్, విజయ్ కుమార్, అనిల్, సతీశ్ పాల్గొన్నారు.

చెక్ డ్యాంలో పడి రైతు మృతి
కోనరావుపేట : పశువులకు నీళ్లు పెడుతూ ప్రమాదవశాత్తు చెక్ డ్యాంలో పడి ఓ రైతు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నిమ్మపల్లి గ్రామానికి చెందిన చిగుర్ల రాజమల్లయ్య(62) వ్యవసాయంతో పాటు పశువులను పోషించేవాడు. రోజు మాదిరిగానే మంగళవారం మేపేందుకు పొలం వద్దకు పశువులను తోలుకెళ్లాడు. పొలం పక్కన ఉన్న మూలవాగు చెక్ డ్యాంలో పశువులకు నీళ్లు తాపి తోలుకోస్తున్న క్రమంలో రాజమల్లయ్య ప్రమాదవశాత్తు చెక్ డ్యాంలో పడి మృతి చెందాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం మూలవాగు చెక్ డ్యాంలో రాజ మల్లయ్య మృతదేహం కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. 

బావిలో పడి మరొకరు..
వీణవంక : మండలంలని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మడ్డి వైకుంఠం(56) ప్రమాదవశాత్తు బావిలో పడి బుధవారం చనిపోయాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. వైకుంఠం తన చిన్న కుమారుడితో కలిసి పొలం వద్ద బావిలో మోటర్ ఫిట్​చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. దీంతో స్థానికులు ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించగా బావిలో ఉన్న నీటిని తొలిగించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

రాజన్నను వెంటనే రిలీజ్ ​చేయాలి - గాయని విమలక్క
కరీంనగర్​ సిటీ, వెలుగు: జనశక్తి నేత కూర రాజన్నను బేషరుతుగా విడుదల చేయాలని గాయని విమలక్క డిమాండ్ చేశారు. కరీంనగర్ జైలులో ఉన్న రాజన్న ములాఖత్​ కోసం బుధవారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజుల క్రితం అరెస్టు చేసిన రాజన్నను కరీంనగర్​ జైలులో పెట్టారని తెలిసిందన్నారు.  ములాఖత్ కోసం వస్తే నిమిషం కూడా ఇన్నర్ ములాఖత్ ఇవ్వలేదని, నేరస్తుల మాదిరిగా జాలీ నుంచి చూడనిచ్చారని అన్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతన్న రాజన్నను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని లేదా విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. తెలంగాణ  ఉద్యమంలో తాము రాష్ట్రమంతా తిరిగి సభల్లో పాల్గొన్నామని, పర్యవరణాన్ని కాపాడుకోవాలని ఊరురా తిరిగిన రాజన్నను అరెస్టు చేయడం బాధాకరమన్నారు. 

పంట నష్టంపై ఎందుకు సర్వే చేయరు?
అధికారులపై లీడర్ల ఆగ్రహం
వాడివేడిగా చందుర్తి జనరల్ బాడీ మీటింగ్  

చందుర్తి : భారీ వర్షాలతో పంటలు దెబ్బతింటే వ్యవసాయ అధికారులు తూతూమంత్రంగా పరిశీలించారే తప్ప.. పంట నష్టంపై సర్వే ఎందుకు చేయడంలేదని లీడర్లు వ్యవసాయ అధికారులను నిలదీశారు. బుధవారం చందుర్తి ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీపీ బైరగోని లావణ్య అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. మండలంలో అన్ని గ్రామాల్లో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చేసి ఒక్క జోగాపూర్ లోనే  ఎందుకు ఎంపిక చేయలేదని జోగాపూర్ ఎంపీటీసీ మెంబర్ మ్యాకల గణేశ్​ అధికారులను ప్రశ్నించారు. అలాగే గ్రామాల్లో విద్యుత్  సమస్య ఉందని, లబ్ధిదారులకు ఆసరా పింఛన్ రావడంలేదని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఆచరణలో సాధ్యం కావడం లేదని బండపల్లి ఎంపీటీసీ రణధీర్ రెడ్డి ఆరోపించారు.  స్పందించిన సెస్ ఏఈ పై అధికారుల ఆదేశం ప్రకారమే వ్యవసాయానికి 7 గంటల కరెంటు ఇస్తున్నామని సభలో ప్రకటించారు. అనంతరం ఎంపీపీ లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజాప్రతినిధులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ రవీందర్, వివిధ శాఖల అధికారులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో చోరీ
చొప్పదండి : స్థానిక కేడీసీసీ బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఈరాల సురేందర్ ఇంట్లో దొంగలు పడి తొమ్మిదిన్నర తులాల బంగారాన్ని అపహరించారు. పోలీ సుల కథనం ప్రకారం.. సురేందర్ మహశుని రామచంద్రం అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తన గ్రామంలో పెళ్లి ఉండడంతో జూలై 27న ఇంటికి తాళం వేసి ఊరెళ్లాడు. దీంతో దొంగలు మంగళవారం రాత్రి సురేందర్ ఇంటి తాళం పగలగొట్టి తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణములు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఇంటికి వచ్చిన నరేందర్​ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 

దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారు: జీవన్ రెడ్డి
జగిత్యాల : స్టేట్ బడ్జెట్ లో కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ ఖర్చు చేయకుండా దళిత బంధు పథకంతో దళితులను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో పీసీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్​తో కలిసి ఆయన మాట్లాడారు. 8 ఏళ్ల లో సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.86 వేల కోట్లు ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ పేరిట రూ.56 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. దళిత బంధుకు ప్రణాళిక ఏర్పాటు చేసి ఎంపిక బాధ్యత కలెక్టర్ కు అప్పగించాలని ప్రభుత్వానికి సూచించారు.