రాజ్యాంగానికి కాదు.. ఆర్ఎస్ఎస్‌కే మోదీ సెల్యూట్ : మాజీ ఎంపీ బృందాకారత్

రాజ్యాంగానికి కాదు.. ఆర్ఎస్ఎస్‌కే మోదీ సెల్యూట్ : మాజీ ఎంపీ బృందాకారత్
  •     సంఘ్ పరివార్‌‌తో మహిళలకు అతిపెద్ద ప్రమాదం: బృందాకారత్  
  •     ఆర్‌‌ఎస్‌ఎస్, బీజేపీని తరిమికొడితేనే మహిళలకు రక్షణ అని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగానికి ప్రధాని మోదీ సెల్యూట్ చేయడం లేదని.. కేవలం ఆర్ఎస్ఎస్‌కు మాత్రమే చేస్తున్నారని ఐద్వా జాతీయ ప్యాట్రన్, మాజీ ఎంపీ బృందాకారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఆర్ఎస్ఎస్ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ చరిత్ర మహిళా పోరాటాలకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఇక్కడి మహిళల పోరాటాలు.. దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. 

ఆదివారం హైదరాబాద్‌లోని బస్ భవన్ గ్రౌండ్‌లో  ఐద్వా 14వ జాతీయ మహాసభల బహిరంగ సభ నిర్వహించారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సభలో బృందాకారత్ మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన సమానత్వం, మత సామరస్యం, లౌకికత్వ విలువలను మోదీ సర్కార్ బుల్డోజర్లతో కూల్చేస్తోందని మండిపడ్డారు.

మహిళలు తమ హక్కులను కాపాడుకోవాలన్నా, కొత్త హక్కులు పొందాలన్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ‘బీజేపీ భగావో.. దేశ్‌కో బచావో’ అని నినదించారు. పేదలు, మహిళల కోసం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ కోసం బలమైన ఐక్య ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైతే మహిళలు స్వేచ్ఛగా ఉంటారో అక్కడే అభివృద్ధి సాధ్యమన్నారు.   

కొత్త జమీందార్లకు మోకరిల్లుతున్నారు: సుభాషిణీ అలీ

తెలంగాణలో నాడు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి వారు జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడితే.. నేడు అదానీ, అంబానీ లాంటి కొత్త జమీందార్లకు ప్రధాని మోదీ మోకరిల్లుతున్నారని ఐద్వా జాతీయ నేత సుభాషిణీ అలీ ఎద్దేవా చేశారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. కేరళను యూపీ మోడల్‌గా మారుస్తానని మోదీ అనడం హాస్యాస్పదమన్నారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ... దేశంలో గూండాలకు బెయిల్ దొరుకుతోందని, హక్కుల కోసం పోరాడేవారు మాత్రం జైళ్లలో మగ్గుతున్నారని అన్నారు. 

దోపిడీదారులకు, నేరస్తులకు మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులతో మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి మాట్లాడుతూ..  దేశంలో బీజేపీ నాయకులు రామ భజన చేయాలని ప్రజలకు చెప్తూ, ఆ పార్టీ నేతలు మాత్రం అదానీ, అంబానీ భజన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వింధ్వంసమే జరగుతుందన్నారు. 

బీహార్‌‌లో సర్ పేరిట 65 లక్షల ఓట్లను తొలగించారని చెప్పారు. మతోన్మాద శక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయకపోతే తెలంగాణ నుంచే కేంద్రంపై జంగ్ సైరన్ మోగిస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి హెచ్చరించారు. మహిళలను పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చాలని చూస్తున్న సంఘ్ పరివార్ కుట్రలను సాగనివ్వబోమన్నారు. సభలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.