ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చి యువతకు జాబ్​లు ఇప్పిస్త : గడ్డం వంశీకృష్ణ

ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చి యువతకు జాబ్​లు ఇప్పిస్త : గడ్డం వంశీకృష్ణ
  • కాకా చూపిన బాటలో ప్రజాసేవ చేస్తా
  • ఓరియంట్​ సిమెంట్​ కంపెనీ కార్మికులకు అండగా ఉంటానని భరోసా
  • బెల్లంపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి రోడ్​షో
  • పాల్గొన్న బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు వినోద్​, వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తాను తీసుకుంటానని పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. తనను ఆశీర్వదిస్తే కాకా చూపిన బాటలో ప్రజాసేవ చేస్తానని చెప్పారు. శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కిష్టంపేట, అచ్చలాపూర్​, తాండూర్ ఐబీ, కాసీపేట, దేవాపూర్, కొండాపూర్​లో రోడ్​ షో నిర్వహించారు. ఇందులో బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ ​వెంకటస్వామి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​తో కలిసి వంశీకృష్ణ పాల్గొన్నారు. 

 వంశీకృష్ణ మాట్లాడుతూ, తన తాత కాకా వెంకటస్వామికి పెద్దపల్లి ప్రజలతో 70 ఏండ్ల అనుబంధం ఉందని, ఆయన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి పోరాడారని గుర్తుచేశారు. కార్మికులకు పెన్షన్​ స్కీం, రేషన్​ సిస్టం తీసుకొచ్చిన ఘనత కాకాదేనన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థకు రూ.450 కోట్ల రుణం ఇప్పించి, సంస్థను కాపాడారని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలన మొత్తం అవినీతిమయమని, ప్రజల సొమ్మును కేసీఆర్​ దోచుకున్నారని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివినవారు కూడా ఆటోలు నడుపుకునే దుస్థితి కల్పించారని మండిపడ్డారు.

 కాకా వెంకటస్వామి.. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టేలా అప్పటి సర్కారును ఒప్పిస్తే.. కేసీఆర్ దాన్ని మార్చి కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారన్నారు. కాళేశ్వరం, మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ ఫెయిల్యూర్​​ ప్రాజెక్టులని, అవి సక్సెస్​ అయితే తమను బోర్లు వేయాలని ప్రజలు ఎందుకు ఆడుగుతున్నారని ప్రశ్నించారు.

స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ఏర్పాటు చేయిస్తా

బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వినోద్​ సహకారంతో  స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ఆర్టీసీ బస్సు డిపో, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని వంశీకృష్ణ చెప్పారు. ఎంపీగా గెలిచాక బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్​ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. తాండూర్​లో  రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయిస్తానని తెలిపారు. తాను సొంత కంపెనీ స్థాపించి 500 మందికి ఉద్యోగాలు కల్పించానని, ఎంపీగా గెలిచిన తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. దేవాపూర్​లోని ఓరియంట్​ సిమెంట్​ కంపెనీ కార్మికుల సమస్యలను పరిష్కారిస్తానని చెప్పారు.

వంశీకృష్ణను గెలిపిస్తే అభివృద్ధి: వివేక్​ వెంకటస్వామి

కాకా బాటలోనే వంశీకృష్ణ ప్రజలకు సేవ చేస్తాడని, వంశీని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తనలాగే వంశీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని, ఎవరు ఫోన్​ చేసినా రెస్పాండ్​అవుతాడని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేర లక్ష కోట్లు దోచుకున్నారని, కాంట్రాక్టర్లను ప్రపంచ ధనవంతులను చేశారన్నారు. మిషన్ భగీరథలో కేసీఆర్​ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్​ను అరెస్టు చేయాలన్నారు. రాష్ట్రంలో వార్ వన్ సైడ్ ఉందని, లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందని చెప్పారు.  పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్​రెడ్డి బ్యాంకర్లతో చర్చిస్తున్నారని చెప్పారు. సింగరేణిలో కొత్త మైన్స్, జైపూర్ ఎస్టీపీపీలో 800 మెగావాట్ల పవర్​యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రజాసేవే వంశీకృష్ణ ధ్యేయం: వినోద్​

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి నియోజకవర్గానికి ఏ మేలు జరగలేదని, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్​ అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల్లోనే తాను వేమనపల్లికి రోడ్డు వేయించానని, తాగునీటి సమస్యను తీర్చానని చెప్పారు. వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే కాలంలో రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు.